ఖమ్మం జిల్లాకు  చెందిన మాజీ ఎంపీ ఒకరు శుక్రవారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో భేటీ  అయ్యారు. తాను టీఆర్ఎస్ లో చేరాలని అనుకుంటున్నానని.. కాకపోతే.. తనకు ఖమ్మం కానీ.. మల్కాజిగిరి టికెట్ కానీ ఇవ్వాలని కోరినట్లు సమాచారం. అయితే.. అందుకు కేటీఆర్ నిరాకరించినట్లు తెలుస్తోంది.

ఒక పార్టీలో కీలక పదవిలో ఉన్న ఆయన ఎంపీ టికెట్‌ కోసం టీఆర్ఎస్ లో చేరాలనుకున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా ఆయన పార్టీ ముఖ్య సమావేశానికి కూడా వెళ్లకుండా హైదరాబాద్‌ వచ్చి టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను కలిశారు. 

తాను టీఆర్ఎస్ లో చేరతానని, ఖమ్మం లేదా మల్కాజిగిరి టికెట్‌ ఇస్తే కచ్చితంగా గెలుస్తానని తెలిపారు. తన సొంత బలంతోనే గెలిచే సత్తా ఉందని వివరించారు. కేటీఆర్‌ ఆ నేత ప్రతిపాదన గురించి సీఎంకు వివరించారని తెలిసింది. పార్టీ తరఫున సమర్థులున్నారని, ఆ మాజీ ఎంపీ అవసరం లేదని, ఆయనను చేర్చుకుంటే సమస్యలు వస్తాయని సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో ఆ మాజీ ఎంపీ వెనుదిరిగారు.