Asianet News TeluguAsianet News Telugu

హైకోర్టు స్టే.. ఖమ్మం ఎన్టీఆర్ విగ్రహంలో కీలక మార్పులు, ఆ రెండు తొలగింపు

ఖమ్మంలోని లకారం చెరువులో ఏర్పాటు చేయదలచుకున్న ఎన్టీఆర్ విగ్రహానికి తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో నిర్వాహకులు కదిలారు. దీనిలో భాగంగానే ఎన్టీఆర్ విగ్రహంలోని పింఛం, పిల్లనగ్రోవిని తొలగించేందుకు అంగీకరించి.. ఈ మేరకు పనులు మొదలు పెట్టారు.

key changes happening in ntr statue at khammam after telangana high court orders
Author
First Published May 19, 2023, 4:02 PM IST

ఖమ్మం నగరంలోని లకారం చెరువు వద్ద దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహం ఏర్పాటుకు తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఏర్పాటు చేయవద్దని జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి నేతృత్వంలోని తెలంగాణ హైకోర్టు వెకేషన్ కోర్టు గురువారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

శ్రీకృష్ణుడి రూపంలో ఏర్పాటు చేసే ఎన్టీఆర్ విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని సవాలు చేస్తూ భారత యాదవ సమితి, అఖిల భారత యాదవ సమితి, ఆదిబట్ల శ్రీకాళా పీఠం వంటి తదితర సంస్థలు దాఖలు చేసిన లంచ్ మోషన్ రిట్ పిటిషన్ పై న్యాయమూర్తి విచారణ జరిపారు. లక్కారం సరస్సు (ఇది పర్యాటక ప్రాంతం)లో దివంగత ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయకూడదని న్యాయమూర్తి పేర్కొన్నారు. అయితే లంచ్ మోషన్ తో పాటు ఇదే తరహా మరో రిట్ పిటిషన్ కూడా జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ముందుకు వచ్చింది.

ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతివ్వడం సుప్రీంకోర్టు ఆదేశాలకు, అలాగే బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలను ఏర్పాటు చేయరాదని తెలంగాణ ప్రభుత్వం 18-12-2016న జారీ చేసిన సర్క్యులర్ కు విరుద్ధమని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై పిటిషనర్లకు ఎలాంటి అభ్యంతరాలు లేవని, కానీ ఆయనను శ్రీకృష్ణుడిగా చిత్రీకరించి ప్రతిష్టించడం హిందువుల, ముఖ్యంగా యాదవ సామాజిక వర్గం మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని పేర్కొన్నారు. వారి వాదనలు విన్న న్యాయమూర్తి విగ్రహ ఏర్పాటుపై స్టే విధించారు.

ALso Read: ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై హైకోర్టు స్టే.. ఎందుకంటే ?

కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎన్టీఆర్ విగ్రహం కమిటీ సభ్యులు, ఎన్ఆర్ఐలు స్పందించారు. హిందూ సంఘాలు, యాదవ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న అంశాలపై దృష్టిపెట్టారు. ఈ అభ్యంతరాల నేపథ్యంలో మార్పులు చేసి విగ్రహాన్ని ప్రతిష్టామని విగ్రహ కమిటీ సభ్యులు తెలిపారు. దీనిలో భాగంగానే ఎన్టీఆర్ విగ్రహంలోని పింఛం, పిల్లనగ్రోవిని తొలగించేందుకు అంగీకరించి.. ఈ మేరకు పనులు మొదలు పెట్టారు. అనంతరం విగ్రహాన్ని యాదవ, హిందూ సంఘాలకు చూపించి హైకోర్టు అనుమతిని కోరనున్నారు. 

కాగా.. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా మే 28న ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాలని నిర్ణయించారు. ఈ విగ్రహ ఏర్పాటు కమిటీకి తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమన్వయకర్తగా ఉన్నారు. అయితే విగ్రహ ఏర్పాటుకు జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ ఆమోదం తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios