హైదరాబాబాద్: కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు లంచం తీసుకొన్న కేసులో అరెస్టైన ధర్మారెడ్డి ఆదివారం నాడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. జైలు నుండి బెయిల్ పై విడుదలైన ధర్మారెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

రూ. 1.10 కోట్ల లంచం తీసుకొన్న కేసులో కీసర మాజీ తహసీల్దార్ నాగరాజుతో పాటు ధర్మారెడ్డి కూడ జైలుకు వెళ్లాడు. గత నెల 13వ తేదీన రాత్రి జైలులోనే నాగరాజు  ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయమై నాగరాజు కుటుంబసభ్యులు హెచ్ఆర్‌సీని కూడ ఆశ్రయించారు. నాగరాజు మృతిపై విచారణ జరిపించాలని కోరారు.

also read:కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు బినామీ లాకర్‌లో కేజీ బంగారం

ఈ కేసులో అరెస్టైన ధర్మారెడ్డి ఇటీవలనే జైలు నుండి బెయిల్ పై విడుదలయ్యాడు. కుషాయిగూడలోని వాసవి శివనగర్ కాలనీలో చెట్టుకు ఉరేసుకొని ఆయన ఆత్మహత్య చేసుకొన్నాడు. ధర్మారెడ్డి ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

భూమి అక్రమ మ్యుటేషన్ ఆరోపణలతో ధర్మారెడ్డితో పాటు ఆయన కొడుకు శ్రీకాంత్ రెడ్డిని ఈ కేసులో ఏసీబీ అరెస్ట్ చేసింది. 33 రోజులుగా జైలు జీవితం గడిపిన ధర్మారెడ్డి బెయిల్ పై బయటకు వచ్చాడు. ఇదే కేసులో  అరెస్టైన ధర్మారెడ్డి కొడుకు శ్రీకాంత్ రెడ్డికి బెయిల్ రాలేదు. దీంతో ఆయన జైల్లోనే ఉన్నాడు.