హైదరాబాద్: ఆత్మహత్య చేసుకొన్న కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు  లాకర్ లో సుమారు కిలో బంగారాన్ని ఏసీబీ అధికారులు గుర్తించారు.

మాజీ తహసీల్దార్ నాగరాజు బినామీగా  ఆరోపణలు ఎదుర్కొంటున్న నందగోపాల్ పేరుతో ఉన్న ఈ లాకర్ లో కేజీకిపైగా బంగారం ఉన్నట్టుగా  ఏసీబీ గుర్తించింది. 
బినామీ పేరుతో పెద్ద ఎత్తున ఆస్తులను నాగరాజు కూడబెట్టారని ఏసీబీ ఆరోపిస్తోంది.

రెండు రోజుల క్రితం నందగోపాల్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అల్వాల్ ఐసీసీఐ బ్యాంకులో నాగరాజు బినామీ నందగోపాల్ పేరుతో ఉన్న లాకర్ ను ఏసీబీ అధికారులు గుర్తించారు. 

also read:నకిలీ పత్రాలతో మ్యుటేషన్ : వెలుగు చూస్తున్న కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు లీలలు

ఇతర ఖాతాలపై కూడ ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. గతంలో రెండు బ్యాంకు లాకర్లలో రెండు కేజీల బంగారాన్ని సీజ్ చేసిన విషయం తెలిసిందే.
ఈ ఏడాది ఆగష్టు 14న నాగరాజు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించిన సమయంలో ఓ బ్యాంకు లాకర్ తాళం చెవి దొరికింది.  ఈ లాకర్ నాగరాజు బంధువు నరేందర్ పేరిట ఉంది.

బ్యాంకు లాకర్ల విషయంలో నాగరాజు సహకరించలేదని సమాచారం.  చంచల్ గూడ జైల్లోనే ఈ నెల 13వ తేదీన రాత్రి నాగరాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ కేసులో మిగిలిన నిందితులు జైల్లోనే ఉన్నారు.