Asianet News TeluguAsianet News Telugu

కేసిఆర్ లేఖ పాఠం ఇదీ: బిజెపితో రహస్య అవగాహన

జమిలి ఎన్నికలకు మద్దతు తెలియజేయడంతో కేసిఆర్ బిజెపితో రహస్య అవగాహనకు వచ్చారనే ప్రచారం ఊపందుకుంది. గతంలో నీతి ఆయోగ్ సమావేశం సందర్భంగా కేసిఆర్ ప్రధాని మోడీని కలిసి ఇతర ముఖ్యమంత్రులతో విడిగా వ్యవహరించారు. 

KCR writes to law panel: Secret pact with BJP

న్యూఢిల్లీ: కేంద్రం ప్రతిపాదించిన జమిలి ఎన్నికలకు మద్దతు తెలుపుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు రెండు పేజీల లేఖ రాశారు. న్యాయ కమిషన్ కు రాసిన తన లేఖలో ఆయన జమిలి ఎన్నికలను ఎందుకు సమర్థిస్తున్నాననే విషయాన్ని వివరించారు. ఆయన రాసిన లేఖ పాఠం ఇదీ...

"దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణ ప్రతిపాదనపై అభిప్రాయం చెప్పే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరపాలంటే నాలుగు నుంచి 6 నెలల సమయం పడుతుంది. అయిదేళ్లలో రెండు సార్లు విడివిడిగా ఎన్నికలు జరపాలంటే రాష్ట్ర, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు, ఉద్యోగులు, భద్రతా సిబ్బందికి చాలా పని ఉంటుంది. దానితోపాటు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చి అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడుతోంది. ఎన్నికల నిర్వహణకు ప్రజాధనం వృథా అవుతుంది. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు కూడా రెండు సార్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇలాంటి అంశాల వల్ల ఒకేసారి ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ బలంగా మద్దతు పలుకుతుంది" 

కేంద్ర ప్రతిపాదనను బలపరచడంతో కేసిఆర్ బిజెపితో రహస్య అవగాహన కుదుర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. పలు ప్రాంతీయ పార్టీలు జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తుండగా కేసిఆర్ మద్దతు పలకడం చర్చనీయాంశంగా మారింది. 

కేసిఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ విషయంలో కూడా అనుమానాలు కలుగుతున్నాయని అంటున్నారు. బిజెపికి అనుకూలంగానే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదనను ముందుకు తెచ్చారని కాంగ్రెసు పార్టీ నాయకులు విమర్శిస్తున్న విషయం తెలిసిందే.

నీతి ఆయోగ్ సమావేశం సందర్భంగా కేసిఆర్ వ్యవహార శైలి కూడా ఆయన బిజెపికి దగ్గరయ్యారనే ప్రచారానికి తావిచ్చింది. బిజెపిని వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, మమతా బెనర్జీ, తదితరులు విడిగా ఓ కూటమి లాగా వ్యవహరించగా, కేసిఆర్ మాత్రం వారితో కలవలేదు. పైగా, సమావేశానికి ముందు ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios