కేసీఆర్ : తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎవరు?...
పదేళ్లపాటు తెలంగాణకు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసిఆర్ .. ఇన్నేళ్లు ముఖ్యమంత్రిగా చేసి ఒక్కసారిగా విపక్ష నేతగా శాసనసభలో కూర్చోవడానికి ఇష్టపడతారా?
తెలంగాణలో ఎన్నికలు ముగిశాయి. అధికార, ప్రతిపక్షాలు స్పష్టం అయ్యాయి. ముఖ్యమంత్రి ఎవరో కొద్ది గంటల్లో తేలిపోతుంది. మరి.. ప్రతిపక్షనేత ఎవరు? అధికార పక్షం నుంచి.. ప్రతిపక్షానికి మారిన టిఆర్ఎస్ నుంచి గెలిచిన నేతల్లో ఎవరు విపక్ష నేతగా ఉండబోతున్నారు? శాసనసభలో అధికార పక్షాన్ని నిలదీసి.. తెలంగాణ తరఫున మాట్లాడబోయేది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆరే విపక్ష నేతగా ఉండబోతున్నారా? లేక కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రి ఆయనే అని ప్రచారం జరిగిన కేటీఆర్ ఉంటారా?.. లేక హరీష్ రావుకు అప్పగిస్తారా?
దీనికి సంబంధించిన చర్చ ఇప్పుడు పార్టీ వర్గాల్లోనూ, సామాన్యుల్లోనూ విపరీతంగా నడుస్తోంది. దీనికి మరో కారణం ఏంటంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత గత పదేళ్లుగా బీఆర్ఎస్ పార్టీ అధికారపక్షంగానే ఉండడం.. తెలంగాణలో ప్రతిపక్షం అనేదే లేకుండా చేయడం. దీంతో శాసనసభలో వారిని ఎదిరించే మొనగాడే లేకుండా పోయాడు. బిజెపి నుంచి కొంతమంది నేతలు కాస్తో, కూస్తో కొంత ప్రయత్నించినప్పటికీ అది అసెంబ్లీ బయటే జరిగింది.
telangana election results 2023 : సెటిలర్ల ఓట్లన్ని కేసీఆర్ పార్టీకే...!
మరి ఇప్పుడు స్పష్టమైన మెజారిటీతో ప్రతిపక్షంగా అవతరించిన బిఆర్ఎస్. ప్రతిపక్షంగా తమ బాధ్యత బాధ్యతాయుతంగా నిర్వర్తించాల్సి ఉంది. అలా చేస్తామని కేటీఆర్ కూడా ఫలితాల తర్వాత చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ముగ్గురిలో ఎవరు శాసనసభలోప్రతిపక్ష నేతగా ఉండబోతున్నారో తేలాలి.
బీఆర్ఎస్ అధినేత.. పదేళ్లపాటు తెలంగాణకు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసిఆర్ .. ఇన్నేళ్లు ముఖ్యమంత్రిగా చేసి ఒక్కసారిగా విపక్ష నేతగా శాసనసభలో కూర్చోవడానికి ఇష్టపడతారా? ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ శాసనసభకు రావడానికి ఇష్టపడతారా? తాను చెప్పిందే వేదంగా ఇన్ని రోజులు నడిచిన తర్వాత.. ప్రతిపక్షంలో నిలబడడానికి మొగ్గుచూపుతారా? అనేది ప్రశ్న.
మరో ప్రశ్న బీఆర్ఎస్ అధికారంలో ఉన్న ఈ పదేళ్లపాటు రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేసింది. ఇప్పుడు అధికార పార్టీగా మారిన కాంగ్రెస్ కూడా ఇదే మంత్రాన్ని ఉపయోగిస్తే ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉందా అనేది? దాని మీద కూడా చర్చ జరుగుతుంది. ఇప్పటివరకు అధికార పార్టీగా ఉన్న టిఆర్ఎస్ ఏం చేసినా ప్రశ్నించేవాళ్లు, క్రాస్ చెక్ చేసేవాళ్లు లేరు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పెను సవాలును ఎదుర్కోక తప్పదని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఓవైపు బిజెపి, మరోవైపు కాంగ్రెస్ నుంచి ఒత్తిళ్లు వచ్చే అవకాశం ఉంది. దీనికి తోడు లోక్సభ, మునిసిపల్, ఇతర స్థానిక సంస్థల ఎన్నికలు వరుసగా రానున్నాయి. వీటిని ఎదుర్కోవడం అంత సులభమైన విషయమేమీ కాదని అంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో హైదరాబాద్ రంగారెడ్డిల్లో తప్ప మిగతా ప్రాంతాల్లో నామమాత్రంగా మాత్రమే బిఆర్ఎస్ గెలుపొందింది.
మార్చి, ఏప్రిల్ లోక్ సభ ఎన్నికలు వస్తున్నాయి. ప్రతిపక్షంగా మారిన బిఆర్ఎస్ కి ఇవి సవాల్ గా మారనున్నాయి. సహజంగానే అధికారంలో ఉన్న కాంగ్రెస్ దూకుడు ప్రదర్శిస్తుంది. ఇక బిజెపి మొదటి నుండి లోక్సభ ఎన్నికల మీదనే దృష్టి పెట్టింది కాబట్టి గట్టి పోటీని ఇస్తుంది. ఈ పోటీని తట్టుకుని నిలబడడం.. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కు కష్టమవుతుందని విశ్లేషణ.
ఈ లోక్సభ ఎన్నికలు ముగియగానే స్థానిక సంస్థలు, సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇలాంటి స్థానిక సంస్థల ఎన్నికలు అన్ని అధికారంలోని పార్టీకే అనుకూలంగా ఉంటాయనేది అందరికీ తెలిసిన విషయమే. అలా చూసినా కూడా ప్రతిపక్షంగా బీఆర్ఎస్ కి దెబ్బ పడనుంది. మరి వీటన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొంటూ శాసనసభలో ప్రతిపక్ష నేతగా కొనసాగేది ఎవరు అనేది.. తేలాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.