KCR Speech: వరంగల్‌ వేదికగా ఆదివారం జరిగిన బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ కేసీఆర్‌ స్పీచ్‌తో దద్దరిల్లింది. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై గులాబి దళపతి ఫైర్‌ అయ్యారు. కాంగ్రెస్‌కు పరిపాలించడం చేతకాక.. రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించారన్నారు. రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులు 80 నుంచి 90 శాతం పూర్తికాగా.. వాటి పనులు పూర్తి చేయలేకపోయారన్నారు. పేద మహిళల కోసం అమలు చేసిన కేసీఆర్‌ కిట్‌ పథకం కూడా బంద్‌ చేశారన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని ఇన్నాళ్లు తాను బయటకు రాలేదని అని కేసీఆర్‌ అన్నారు. ఇప్పటి నుంచి బయటకి వస్తా.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని అన్నారు. తెలంగాణ ప్రజల తరఫున పోరడతా అని తెలిపారు. ఇకనైనా ప్రజలు ఆలోచించి తెలివితో వ్యవహరించాలన్నారు. ఇక పోలీసుల తీరుపై ఫైర్‌ అయ్యారు కేసీఆర్... అక్రమంగా బీఆర్‌ఎస్‌ నేతలపై కేసులు పెడుతున్నారని అలా చేసేవారిని వదిలిపెట్టమన్నారు. 

రాష్ట్రంలో ఎలాంటి మంచి కార్యక్రమం తీసుకొచ్చినా.. తాను మద్దతు ఇస్తానని కేసీఆర్‌ అన్నారు. ఆనాడే వైఎస్‌ఆర్‌ తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ పథకాన్ని రద్దు చేయకుండా కొనసాగించామన్నారు. కనీసం పేరు కూడా మార్చలేదన్నారు. ఇక కాంగ్రెస్‌ చేసే తప్పిదాలను బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు సోషల్‌ మీడియాలో ప్రశ్నిస్తే.. వారిపై పోలీసులు కేసులు పెడుతున్నారని కేసీఆర్‌ మండిపడ్డారు. పోలీసులకు చెబుతున్నా.. మీరు డైరీల్లో రాసుకోండి.. మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ గెలుపుని ఆపడం ఎవరి తరం కాదన్నారు. 

తమకు తెలంగాణలో ప్రజలు దీవించి పదేళ్లపాటు అధికారం ఇస్తే.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించామని, ప్రాజెక్టులు నిర్మించి సాగుభూమిని పెంచామన్నారు. మూడేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాం, తెలంగాణను అద్భుతంగా నిర్మించుకున్నామన్నారు. పంజాబ్‌ రాష్ట్రానికి ధీటుగా తెలంగాణలో పంటలు పండేలా తయారు చేశామన్నారు. 


రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ప్రభంజనం చూస్తారన్నారు. ఇక కేసులు ఎదుర్కొంటున్న పార్టీ కార్యకర్తలకు లీగల్‌సెల్‌ తోడుగా ఉంటుందన్నారు. కాంగ్రెస్‌ సర్కార్‌ అన్ని విషయాల్లో విఫలమైందన్నారు. ప్రతి పనిలో, పథకంలో కమీషన్లు కక్కుర్తి పడుతూ.. సంచులు నింపుకుంటున్నారన్నారు. తనను అసెంబ్లీకి రావాలని సవాల్‌ విసురుతున్నారని, పిల్లలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము కాంగ్రెస్‌ నేతలకు లేదన్నారు. కమిషన్ల గురించి హరీశ్‌రావు అసెంబ్లీలో ప్రశ్నిస్తే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మంత్రులు భుజాలు తడుముకుంటున్నారన్నారు. 

ఎక్కడ పోగొట్టుకున్నామో మళ్లీ అక్కడే సాధించాలని తెలంగాణ ప్రజలకు సూచించారు కేసీఆర్‌. ఏదేమైనా మాట్లాడితే బీఆర్‌ఎస్‌పై నిందలు వేస్తున్నారన్నారు. ఈ సందర్బంగా బీజేపీ కేంద్ర బలగాలతో ఆపరేషన్‌ కగార్‌ పేరుతో ఛత్తీస్‌గఢ్‌లో గిరిజనులు, యువతను ఊచకోత కోస్తున్నారని, నక్సలైట్లు చర్చలకు పిలవాలని చెబుతున్నా పట్టించుకోవడం లేదని కేసీఆర్‌ మండిపడ్డారు. బలగాలు ఉన్నాయని అందర్నీ చంపుతూ వెళ్తే.. ప్రజాస్వామ్యం అనిపించుకోదన్నారు. ఆపరేషన్‌ కగార్‌ తక్షణమే నిలిపివేయాలన్నారు.