కేసీఆర్ మీద ఫైర్ అయ్యింది కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ. వ్యవసాయబోర్లకు విద్యుత్ మీటర్లు అమర్చమని తాము ఒత్తిడి చేయలేదని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలా అవాస్తవాలు ప్రచారం చేయడం తగదని విరుచుకుపడింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

హైదరాబాద్ : కొన్ని రోజులుగా తెలంగాణలో current meters ల రాజకీయం వేడెక్కింది. ఈ ఇష్యూ మీద కేసీఆర్, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలాయి. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చింది Central Government. ముఖ్యమంత్రి kcr వ్యాఖ్యలపై కేంద్ర Ministry of Power స్పందించింది. అపోహలు -వాస్తవాలు పేరిట కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ పేరుతో ప్రకటన విడుదల చేసింది. ఇటీవల జనగామ, భువనగిరి లో నిర్వహించిన బహిరంగ సభల్లో కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పించారు సీఎం కేసీఆర్. విద్యుత్ సంస్కరణల్లో భాగంగా కేంద్రం వ్యవసాయ బోర్లు, బావుల మోటార్ లకు మీటర్లు పెట్టాలని.. మెడపై కత్తి పెట్టిందని ఆరోపించారు.

కేంద్రం తెచ్చిన విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తే లాండ్రీ లు, పౌల్ట్రీలు, దళితులకు విద్యుత్ రాయితీలు ఇచ్చే అవకాశం ఉండదని చెప్పారాయన. విద్యుత్ సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలకు మాత్రమే FRMB పరిమితి అరశాతం పెంచారని, దీనివల్ల ఐదేళ్లలో తెలంగాణకు 25 వేల కోట్ల నష్టం జరిగే అవకాశం ఉందని అన్నారు. అయితే, సీఎం కేసీఆర్ ఆరోపణలు కేంద్ర విద్యుత్ శాఖ ఖండించింది. వ్యవసాయ బోర్లు, బావుల వద్ద మోటార్ లకు విద్యుత్ మీటర్లు పెట్టాలని రాష్ట్రాలను బలవంతం చేయడంలేదని స్పష్టం చేసింది. 

పునరుత్పాదక ఇంధన వినియోగానికి సంబంధించి ఏ రాష్ట్రంపైన ఇప్పటివరకు ఒత్తిడి చేయలేదని తెలిపింది. సౌర విద్యుత్ కొనుగోలుకు రాష్ట్రాలను బలవంతం చేయట్లేదని, విద్యుత్ కొనుగోలు వ్యవహారాలన్నీ ఓపెన్ బిడ్ ల ద్వారానే జరుగుతాయని కేంద్రం స్పష్టం చేసింది. ఆయా రాష్ట్రాలు విద్యుత్ అవసరాలకు అనుగుణంగా కొనుగోలు చేస్తాయని, ఇదంతా బహిరంగంగానే జరుగుతుందని కేంద్రం తెలిపింది. ఇందులో ఎలాంటి దాపరికం లేదని స్పష్టం చేసింది. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి అపోహలు, అవాస్తవాలు మాట్లాడటం సరికాదని కామెంట్ చేసింది కేంద్రం. 

ఇదిలా ఉండగా, ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఆదివారం ప్రగతి భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోడీ చెప్పేది ఒకటి, చేసేది ఒకటన్నారు. మోడీ అబద్ధాలు ఎక్కువగా చెబుతున్నారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. మోడీ వల్ల దేశం ఎంత నాశనమవుతుందో వివరిస్తూ ఎంతోమంది పుస్తకాలు రాస్తున్నారని కేసీఆర్ దుయ్యబట్టారు. విద్యుత్ సంస్కరణలపైనా అబద్ధాలే చెబుతున్నారని సీఎం ఆరోపించారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెట్టాల్సిందేనని ముసాయిదా బిల్లులో ప్రస్తావించారని కేసీఆర్ దుయ్యబట్టారు. 

మోడీ రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించారని... పార్లమెంట్‌లో ఆమోదం పొందకముందే బిల్లును అమలు చేస్తున్నారని ముఖ్యమంత్రి ఆరోపించారు. ఏపీలో ఇప్పటికే కొన్ని వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టారని.. మీటర్లు పెడుతున్న రాష్ట్రాలకు 0.5 శాతం ఎఫ్ఆర్‌బీఎం అదనంగా ఇస్తామంటున్నారని కేసీఆర్ తెలిపారు. మీటర్లు పెట్టమనకుండానే జగన్‌మోహన్ రెడ్డి పెట్టారా అని సీఎం ప్రశ్నించారు. తెలంగాణలో విద్యుత్ సంస్కరణలు అమలు చేయట్లేదని వచ్చే డబ్బులు కూడా ఆపేస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడికి ఇవేమీ తెలియదని.. రాష్ట్రానికి 25 వేల కోట్ల నష్టం వస్తుందని తెలిసినా, తాను మీటర్లు పెట్టలేదని సీఎం వెల్లడించారు. 

మిషన్ భగీరథ ప్రారంభ సభలోనూ మోడీ అబద్ధాలే చెప్పారంటూ కేసీఆర్ దుయ్యబట్టారు. తెలంగాణకు యూనిట్ రూ.1.10కే ఇస్తున్నట్లు మోడీ చెప్పారని.. నా పక్కనే నిలబడి మోడీ అబద్ధం చెబుతున్నా మర్యాద కోసం తాను మాట్లాడలేకపోయానని కేసీఆర్ గుర్తుచేశారు. అసలు ఎప్పుడైనా తెలంగాణకు యూనిట్ రూ.1.10కే విద్యుత్ ఇచ్చారా అని మోడీ సమాధానం చెప్పాలని సీఎం డిమాండ్ చేశారు. 40 వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్ట్‌ల నిర్మాణం పూర్తయినా కరెంట్ ఉత్పత్తి చేయనివ్వడం లేదని.. కేంద్ర ప్రభుత్వ తప్పుడు విద్యుత్ విధానం వల్లే ఈ పరిస్ధితి వచ్చిందని కేసీఆర్ ఆరోపించారు.