తెలంగాణలో బలమైన సామాజికవర్గంగా రెడ్డీ కులస్తులు ఉన్నారు. ఏండ్ల తరబడి వారంతా అధికారానికి దగ్గరగా ఉన్నారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత తమ చేతిలో ఉన్న అధికారం జారిపోయిందన్న ఆందోళన ఆ వర్గంలో కనబడుతున్నది. వెలమ సామాజిక వర్గం వారి పెత్తనం ఎక్కువైపోయిందన్న ఆగ్రహం కూడా కనబడుతున్నది.

ఈ నేపథ్యంలో తెలంగాణ రెడ్డీలు సర్కారు మీద గుర్రుగా ఉన్నారు. వారికి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అండగా ఉందని చెబుతున్నారు. అయితే తెలంగాణలో శాసించగలిగే సామాజికవర్గం కాబట్టి రేపు ఎన్నికల్లో ఏదైనా తేడా వస్తే టిఆర్ఎస్ నుంచి అధికారాన్ని దూరం చేస్తారన్న చర్చ గులాబీ పార్టీలోనూ ఉంది. ఈ నేపథ్యంలో రెడ్డి సామాజికవర్గాన్ని దగ్గరకు తీసుకునే ఉద్దేశంతో తెలంగాణ సిఎం కేసిఆర్ పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

తాజాగా రైతుబంధు పథకం ప్రారంభించారు సిఎం కేసిఆర్. కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ లో జరిగిన సభలో రైతు బంధు పథకాన్ని కేసిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కేసిఆర్ మాట్లాడుతూ అగ్రవర్ణ పేదలకు గురుకులాలు ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. దీనిపై ఇప్పటికే టిఆర్ఎస్ అనుకూల రెడ్డి కుల సంఘం నాయకులు సిఎం కేసిఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సిఎం కేసిఆర్ కు రెడ్డి సంఘం తరుపున ధన్యవాదాలు చెబుతున్నట్లు వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు వైరల్ అవుతున్నాయి. హుజూరాబాద్ సభలో ఓసిలకు గురుకులాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ రాకముందు కేజి టు పిజి ఉచిత నిర్భంద విద్య అమలు చేస్తామని కేసిఆర్ ప్రకటించారు. ముఖ్యమంత్రి మనవడు, రిక్షా కార్మికుడి కొడుకు ఒకే బడిలో చదవాలె అన్నారు. అంతేకాదు కులానికో బడి ఉండుడేంది? అన్ని కులాలకు కలిపి ఒకే బడి ఉండేలా కేజి టు పిజి ఉచిత విద్య అమలు చేస్తామని ప్రకటించారు.

తీరా తెలంగాణ వచ్చిన తర్వాత కులానికో గురుకులం ఏర్పాటు చేశారు. దీనిపై ఇప్పటికే ప్రజా సంఘాలు పలు సందర్భాల్లో సర్కారు తీరును ఎండగట్టాయి కూడా.

అగ్రకుల పేదలందరికీ గురుకులాలు ఏర్పాటు చేస్తున్నామని కేసిఆర్ చెబుతున్నప్పటికీ రెడ్డి సామజికవర్గం వారిని సంతృప్తి పరిచేందుకే ఈ ప్రకటన చేసినట్లు భావిస్తున్నారు. ఇతర అగ్రకులాల ప్రతినిధులు ఇప్పటికే కేసిఆర్ కు సన్నిహితంగా ఉంఉడం వల్ల మిగిలిన అగ్రకులాలలను ప్రత్యేకంగా సంతృప్తి పర్చాల్సిన అవసరం కేసిఆర్ కు లేదని చెబుతున్నారు. అందుకే రెడ్డ సామాజికవర్గాన్ని దృష్టిలో ఉంచుకునే కేసిఆర్ అగ్రకులాలకు గురుకులాల ప్రకటన చేసినట్లు మరికొందరు భావిస్తున్నారు. దీనికితోడు సిద్ధిపేటలో రెడ్డి యూత్ సర్కారుకు వ్యతిరేకంగా ఇటీవల కాలంలో ఆందోళన చేసిన విషయం కూడా తెలిసిందే. ఒక బలమైన సామాజికవర్గం దూరంగా ఉందన్న ఉద్దేశంతోనే కేసిఆర్ కొత్త ప్రకటన చేసినట్లు చెబుతున్నారు.

మరి ఓసి గురుకులాల ఏర్పాటు అంశం ఏమేరకు తెలంగాణ రెడ్డీలను ఆకర్షిస్తుందో ఆచరణలో తేలనుంది.