Asianet News TeluguAsianet News Telugu

కెసిఆర్ వాస్తు వైరల్ అయింది

తెలంగాణ సిఎం కెసిఆర్ అడుగు తీసి అడుగు వేయాలన్నా వాస్తు ప్రకారమే చేస్తారు. ఆయన కుసునే సీటు, తినే ప్లేటు, పడుకునే మంచం, ఉండే ఇల్లు, వాడే కారు, తాగే నీరు  ప్రతీది వాస్తు ప్రకారమే చేస్తారు. ఇంట్లో చెట్లు కూడా వాస్తు ప్రకారమే పెట్టిస్తారు. ఆయన నమ్మే వాస్తు ఆయనకు కొండంత బలం. కెసిఆర్ జీవితంతో వాస్తు అంతగా పెనవేసుకుంది. మరి ఆ వాస్తు ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పాకుతోంది. తెలంగాణతోపాటు మిగతా రాష్ట్రాలకూ చేరుతోంది. ఇంకొద్ది రోజుల్లోనే ఆ వాస్తు వైరల్ అయి ప్రపంచాన్ని చుట్టేస్తుందని వాస్తు పండితులు పరమానందంగా చెబుతున్న మాట.

kcr vaastu sentiment goes viral in Telangana

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ వాస్తు ప్రవాహం వేగం పుంజుకుంటున్నది. రాజ్యాంగబద్ధమైన ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిగా ఆయన నమ్మకాలు, వ్యక్తిగత ఇష్టాఇష్టాలను ఇప్పుడు వందలు, వేలు, లక్షల మంది ఫాలో అవుతున్నారు. సిఎం కుర్చీలో కూర్చున్న వ్యక్తి వాస్తు పేరుతో కోట్లాదిరూపాయల ప్రజాధనం మంచినీళ్లలా ఖర్చు చేస్తున్న తరుణంలో తామేమీ తక్కువ తినలేదన్నట్లు అధికార యంత్రాంగం  కూడా వాస్తు పేరుతో ప్రజాధన వినియోగానికి కంకణబద్ధులవుతున్నారు.

 

నిన్నటికి నిన్న కుకునూరుపల్లి పోలీసు స్టేసన్ కు వాస్తు దోషం ఉందంటూ అక్కడ గోడలు కూలగొట్టి, స్టేషన్ లోపల మార్పులు చేర్పులు చేశారు. ఇది విడ్డూరంగా అనిపించినా రాజ్యాంగం ప్రకారం ఇది అనుమతించదగిన పని కాదన్నది హేతువాదుల వాదన. కానీ చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులు వాస్తుకే భయపడిపోతే ఇక ముష్కర మూకల నుంచి జనాలను ఏం రక్షిస్తారన్న ప్రశ్నలు వస్తున్నాయి.

 

ఇక తాజాగా సిద్ధిపేట కలెక్టరేట్ వాస్తుదోషం తో వణికిపోతున్నది. ఆ కలెక్టరేట్ లో వాస్తు దోష నివారణ చేయడం కోసం కంపౌండ్ గోడ కూలగొట్టి కొత్తది కడుతున్నారు. అదేమంటే ఆ బిల్డింగ్ కు వాస్తు బాగాలేని కారణంగా ఓ వ్యక్తి చనిపోయాడని అంటున్నారు. వాస్తు మార్పులు, చేర్పుల కోసం కొంత మేరకు రోడ్డును ఆక్రమించి మరీ పనులు చేపడుతున్నారు.

 

సిఎం కెసిఆర్ చల్లిన వాస్తు విత్తనాలు తెలంగాణ అంతటా మొలకెత్తుతున్నాయి. బాధ్యతాయుతమైన ఉన్నత స్థానాల్లో ఉన్న అధికారులు సైతం వాస్తు కి ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారు. వాస్తు బాగాలేదని సిఎం కెసిఆర్ సచివాలయం మొఖం చూడకపోవడం, ఉన్న క్యాంపు ఆఫీసును కూలగొట్టి కోట్లాది రూపాయలతో కొత్తది నిర్మించడం వాస్తు ప్రకారమే జరుగుతున్నాయి. 

 

వాస్తు దోశం ఉందని సచివాలయాన్ని మొత్తానికి మొత్తంగా నేలమట్టం చేస్తామనడం వంటి చర్యలు అధికార వర్గాలను, దిగువ స్థాయి నాయకగణాన్ని బాగానే ప్రభావితం చేశాయంటున్నారు. ఇప్పుడు ఊరు వాడా కెసిఆర్ మార్గదర్శనంలో వాస్తు హడావిడి జోరుగా సాగుతోంది. యదా రాజా తదా ప్రజ అని ఉత్తగనే అనలేదు మన పెద్దలు.

Follow Us:
Download App:
  • android
  • ios