హైదరాబాద్‌ : దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికలు పూర్తైన నేపథ్యంలో ఫెడరల్ ఫ్రంట్ పై ప్రత్యేక దృష్టి సారించారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఎన్నికలకు ముందు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసిన కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఆవశ్యకతపై చర్చించారు. 

బీజేపీ, కాంగ్రెస్ యేతర పార్టీలు కేంద్రంలో అధికారంలోకి వస్తే రాష్ట్రాలు బాగుపడతాయని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఇటీవల జరిగిన తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో సైతం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ నే ఎన్నికల ప్రధాన అస్త్రంగా మలచుకున్నారు. 

ఎన్నికల అనంతరం కొద్దిరోజులుపాటు మౌనంగా ఉన్న కేసీఆర్ తాజాగా ఫెడరల్ ఫ్రంట్ ను బలోపేతం చేసేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తి అయిన నేపథ్యంలో ఎన్నికల సరళి, పోలింగ్ విధానం, సర్వేలపై ఆరా తీసిన కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీలకు పూర్తి స్థాయి మెజారిటీ రాదని ఏ ఒక్క పార్టీ కూడా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యలేదని కేసీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నారు. మే 23న ఎన్నికల ఫలితాలు వెలుడిన అనంతరం ఆయన ఇతర వివిధ రాష్ట్రాల్లో పర్యటించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. 

ముందుగా సీఎం కేసీఆర్‌  ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్ ఘడ్,  కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించబోతున్నారని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఫ్రంట్‌ ఏర్పాటుపై తమతోకలిసి రావటానికి సిద్ధంగా ఉన్న ప్రాంతీయ పార్టీల నేతలతో సీఎం కేసీఆర్‌ భేటీ అవుతారని స్పష్టం చేస్తున్నాయి.

 లోక్‌సభ ఫలితాల అనంతరం కేంద్రప్రభుత్వ ఏర్పాటులో పోషించాల్సిన పాత్రపై కేసీఆర్ ఇప్పటికే సన్నిహితులు, పార్టీ కీలక నేతలతో చర్చించినట్లు సమాచారం. త్వరలోనే కేసీఆర్ టూర్లపై వివరాలు వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది.