ఈ నెల 15న బీఆర్ఎస్ మేనిఫెస్టో: నవంబర్ 9న కేసీఆర్ నామినేషన్
ఈ నెల 15న ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్: ఈ నెల 15న బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. అదే రోజున పార్టీ అభ్యర్థులకు కేసీఆర్ బీ ఫారాలను అందించనున్నారు. ఈ నెల 16న వరంగల్ లో నిర్వహించే సభలో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయాలని భావించారు. అయితే వరంగల్ సభను దసరా తర్వాత నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఎన్నికల మేనిఫెస్టోను ఈ నెల 15న విడుదల చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది.
అనారోగ్యంతో ఉన్న కేసీఆర్ కోలుకున్నారు. నిన్నటి నుండి పార్టీ నేతలతో ఆయన మాట్లాడుతున్నారు. పార్టీ ప్రచారంపై నేతలకు కేసీఆర్ దిశా నిర్ధేశం చేస్తున్నారు. ఈ నెల 9వ తేదీ నుండి కేసీఆర్ జిల్లాల్లో పర్యటించనున్నారు.ఈ ఏడాది నవంబర్ 9న గజ్వేల్, కామారెడ్డి సభల్లో కేసీఆర్ పాల్గొంటారు.అదే రోజున గజ్వేల్, కామారెడ్డిలలో కేసీఆర్ నామినేషన్లు దాఖలు చేస్తారు.నవంబర్ 9వ తేదీ ఉదయం సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
అనంతరం గజ్వేల్ లో సిఎం కేసీఆర్ మొదటి నామినేషన్ వేస్తారు.ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు కామారెడ్డిలో రెండవ నామినేషన్ వేస్తారు. అనంతరం మూడు గంటల నుంచి ప్రారంభమయ్యే కామారెడ్డి బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.
ఈ నెల 15న హుస్నాబాద్ లో,ఈ నెల 16న జనగామ, భువనగిరిఈ నెల 17న సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొంటారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇవాళ విడుదలైంది. ఈ ఏడాది నవంబర్ 30న పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.