హైదరాబాద్:ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపును 60, 61 ఏళ్లకా అనే విషయాన్ని త్వరలోనే ప్రకటించనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఉద్యోగ విరమణ వయస్సును రెండు, మూడేళ్లు పెంచాలనే దానిపై త్వరలోనే స్పష్టత ఇవ్వనున్నట్టు ఆయన తేల్చి చెప్పారు.

మంగళవారం నాడు గ్రామాల్లో 30 రోజుల్లో ప్రత్యేక కార్యాచాచరణ ప్రణాళిక అమలుపై రాజేంద్రనగర్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఉద్యోగ విరమణ వయో పరిమితి పెంపుపై గత అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. 

ఉద్యోగుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన ప్రకటించారు. మండల, జిల్లా పరిషత్తు సమావేశాల్లో అధికారులు, ఉద్యోగులను ఎవరైనా పరుష పదజాలంతో దూషిస్తే ప్రభుత్వం ఉపేక్షించబోదన్నారు. దూషించిన వారిపై కేసులు పెడతామని ఆయన హెచ్చరించారు. 

ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆయన చెప్పారు. అయితే ప్రమోషన్ల కోసం వేసిన కేసులను ఉపసంహరించుకోవాలని ఆయన ఉద్యోగులను కోరారు.

ఉద్యోగులకు ప్రమోషన్ చార్టును రూపొందించి... ఏ ఉద్యోగికి ఏ రోజున ప్రమోషన్ వస్తోందోననే విషయాన్ని ముందే తెలిపేలా చార్ట్ ను రూపొందిస్తున్నామని ఆయన వివరించారు.పదోన్నతుల కోసం పైరవీలు చేసే దుస్థితి పోవాలని అన్నారు. 

అవసరమైతే సూపర్‌ న్యూమరరీ పోస్టులు సృష్టిస్తామని వెల్లడించారు. అలాగే.. గ్రామ పంచాయతీల్లో స్వీపర్లు, అటెండర్లు, కామాటి వంటి ఉద్యోగులు 65 ఏళ్ల వయసు పైబడి పని చేస్తున్నారని, శరీరం సహకరించకపోతే.. ఆ ఉద్యోగాలను వారి వారసులకు ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు.

ఇక నుండి ఆయా కలెక్టర్ల పని తీరు ఆధారంగా వారి సర్వీస్ రికార్డులను తానే రాస్తానని సీఎం వెల్లడించారు. ప్రస్తుతం కలెక్టర్ల సర్వీస్ రికార్డును చీఫ్ సెక్రటరీ రాస్తే తాను సంతకం చేస్తున్నట్టుగా ఆయన తెలిపారు.

కలెక్టర్ల పనితీరు ఆధారంగా గ్రీన్ కలెక్టర్ అవార్డును ఇస్తామని ఆయన ప్రకటించారు.వికారాబబాద్ జిల్లాను చార్మినార్ జోన్ కలుపుతూ ఆదేశాలు జారీ చేయాలని సీఎస్ ను ఆయన ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అధికారులను దూషిస్తే ఊరుకునేది లేదు: కేసీఆర్ వార్నింగ్