మండల, జిల్లా పరిషత్ సమావేశాల్లో అసభ్యపదాలు వాడితే సహించేది లేదని హెచ్చరించారు తెలంగాణ సీఎం కేసీఆర్. గ్రామీణాభివృద్ధి కార్యాచరణపై మంగళవారం రాజేంద్రనగర్‌లో అధికారులు, నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. అధికారులు, ప్రభుత్వోద్యోగులను దూషిస్తే ప్రభుత్వం సహించదని హెచ్చరించారు. సమావేశాల్లో పరుష పదాలను ఉపయోగించేవారిపై చర్యలు తీసుకుంటామని కేసీఆర్ స్పష్టం చేశారు.

అలాగే పదవీ విరమణ వయస్సును 60 లేదా 61కి పెంచుతామని.. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చుతామని తెలిపారు. వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్‌లో విలీనం చేస్తున్నట్లు తక్షణం ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా సీఎం ఆదేశాలు జారీ చేశారు.

నాటిన మొక్కల్లో 85 శాతం బతికి తీరాల్సిందేనని బాధ్యతారహిత్యం, లక్ష్యాన్ని చేరుకోని సర్పంచ్‌లపై వేటు తప్పదని కేసీఆర్ హెచ్చరించారు. సరిగా పనిచేయని కలెక్టర్లు వార్షిక ప్రణాళికలో ప్రతికూల మార్కులు ఉంటాయని తెలిపారు.