తెలంగాణ భవన్‌లో మంగళవారం టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో సంయుక్తంగా ఈ సమావేశం నిర్వహించనున్నారు.

తెలంగాణ భవన్‌లో మంగళవారం టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో సంయుక్తంగా ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఆకస్మాత్తుగా టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం జరగనున్న నేపథ్యంలో.. టీఆర్‌ఎస్ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల్లోనూ అత్యవసర భేటీపై ఊహాగానాలు మొదలయ్యాయి. తెలంగాణ రాజకీయాల్లో ముందస్తు ఎన్నికలపై మరో విపరీతమైన చర్చ మొదలైంది. 2018లో ముందస్తుకు వెళ్లినట్టుగానే.. ఈసారి కూడా కేసీఆర్ ముందస్తుకు తెరతీస్తారా? అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. రాజకీయంగా కీలక ఎత్తుగడ వేసే ఉద్దేశంతోనే కేసీఆర్ ఈ సమావేశం నిర్వహిస్తున్నారని చాలా మంది భావిస్తున్నారు.

ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్‌గా మార్చే ప్రతిపాదనను ఆమోదం తెలిపిన పార్టీ జనరల్ బాడీ.. ఆ తీర్మానాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా అందజేసింది. మరోవైపు పార్టీ పేరు మార్పుకు సంబంధించి అభ్యంతరాలు ఉంటే కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుపాలని టీఆర్ఎస్ పబ్లిక్ నోటీసు జారీ చేసింది. మరో నెల, రెండు నెలల్లోనే టీఆర్ఎస్ పేరు మార్పుకు ఎన్నికల సంఘం ఆమోదం పొందే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో కేసీఆర్ జాతీయ రాజకీయాలపై మరింత సమయం వెచ్చించే అవకాశం ఉంది.

ఇదిలా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ప్రలోభాలు, మునుగోడు ఉప ఎన్నికలో పార్టీ గెలుపు, తెలంగాణ పర్యటన మోదీ చేసిన కామెంట్స్.. నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఈ భేటీ జరగనున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి సమగ్ర కార్యచరణపై కేసీఆర్ పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశన చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ముందస్తుకు వెళ్లడంపై కూడా కేసీఆర్ ఈ విస్తృత స్థాయి సమావేశంలో చర్చించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. గతంలో మాదిరిగానే ముందస్తుకు వెళితే ఎదురయ్యే పరిణామాలపై కూడా ఆయన పార్టీ ముఖ్య నేతల నుంచి అభిప్రాయాలు సేకరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ముందస్తుపై పార్టీ నేతలతో కేసీఆర్ ఎలాంటి ప్రకటన చేయకపోయినప్పటికీ.. ఎన్నికలు ఎప్పుడూ వచ్చిన సిద్దంగా ఉండాలని సూచన చేసే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్. 

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కేసీఆర్.. అసెంబ్లీని రద్దు చేయడం ద్వారా ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలపై చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. ఇలా చేస్తే వచ్చే ఏడాది జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటు తెలంగాణలో ఎన్నికలు నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. మునుగోడులో పాజిటివ్ ఫలితం రావడం, ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న కేంద్ర దర్యాప్తు సంస్థల దాడుల నేపథ్యంలో కేసీఆర్ ముందస్తు వైపు మొగ్గు చూపవచ్చనే ప్రచారం సాగుతుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను త్వరగా పూర్తి చేసుకుని.. రాష్ట్రంలో మరోసారి అధికారం దక్కించుకుంటే.. తర్వాత జాతీయ పార్టీపై ఎక్కువ సమయం కేటాయించేందుకు అవకాశం దక్కుతుందని కేసీఆర్ ఆలోచిస్తున్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. 

ఈ పరిణామాలను గమనిస్తే.. రేపటి టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ఏ సమయంలోనైనా అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని, రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలకు చెక్ పెట్టాలని కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.