హైదరాబాద్: వచ్చే శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు రెండు చోట్ల పోటీ చేసే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. గజ్వెల్ నుంచే కాకుండా మరో నియోజకవర్గం నుంచి కూడా ఆయన పోటీ చేసే అలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. 

పార్టీ నేతల విజ్ఞప్తి మేరకు ఆయన మరో చోటి నుంచి కూడా పోటీ చేయడానికి సిద్ధపడుతున్నట్లు చెబుతున్నారు. బహుశా ఆయన మేడ్చెల్ నియోజకవర్గం నుంచి సైతం పోటీ చేయవచ్చునని అంటున్నారు. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గం అభ్యర్థిని ప్రకటించలేదు. 

కేసిఆర్ 2014 ఎన్నికల్లో గజ్వెల్ శాసనసభ నియోజకవర్గం నుంచే కాకుండా మెదక్ లోకసభ స్థానం నుంచి కూడా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత కేసిఆర్ లోకసభకు రాజీనామా చేశారు. కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ లోకసభ జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 

గజ్వెల్ లో ఈసారి కేసిఆర్ కు తీవ్రమైన పోటీ ఎదురు కావచ్చునని తెలుస్తోంది. అయితే, గజ్వెల్ లో గత 60 ఏళ్లలో జరగని అభివృద్ధి ఈ నాలుగున్నరేళ్లలో జరిగిందని, అందువల్ల గజ్వెల్ ప్రజలు తిరిగి కేసిఆర్ ను గెలిపిస్తారని టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. 

గత ఎన్నికల్లో కేసీఆర్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డిపై 19,390 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. కాంగ్రెసు తరఫున పోటీ చేసిన నర్సారెడ్డి మూడో స్థానంలో నిలిచాడు. అయితే ఆ తర్వాత నర్సారెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. అయితే, తాజాగా ఆయన తిరిగి కాంగ్రెసులోకి వచ్చారు. ఇప్పుడు కాంగ్రెసు, టీడీపీల మధ్య పొత్తు ఉండడంతో కేసిఆర్ తీవ్రమైన పోటీ ఎదుర్కుంటారని చెబుతున్నారు.

గజ్వెల్ నుంచి వంటేరు ప్రతాపరెడ్డి తిరిగి పోటీ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. ఆయనకు నర్సారెడ్డి సహకారం కూడా లభిస్తుంది. దీనివల్ల గజ్వెల్ లో దాదాపుగా కేసిఆర్ గతంలో మాదిరిగా కాకుండా ముఖాముఖి పోటీని ఎదుర్కుంటారు. 

కేసిఆర్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయడంలో తప్పేమీ లేదని టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ఎన్టీఆర్ 1989 ఎన్నికల్లో హిందూపురం నుంచే కాకుండా కల్వకుర్తి నుంచి కూడా పోటీ చేశారు. అయితే ఆయన కల్వకుర్తిలో ఓటమి పాలయ్యారు. చిరంజీవి 2009 ఎన్నికల్లో తిరుపతి నుంచే కాకుండా పాలకొల్లు నుంచి కూడా పోటీ చేశారు. తిరుపతిలో గెలిచిన చిరంజీవి పాలకొల్లులో ఓడిపోయారు.