Kalvakuntla Chandrashekar Rao : జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కేసీఆర్ ఎంట్రీ ఖాయమయ్యింది. ఆయన పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా బిఆర్ఎస్ అధికారికంగా ప్రకటించింది. 

Jubilee Hills Bypoll : తెలంగాణ రాజకీయాలు ఇకపై మరింత రసవత్తరంగా మారనున్నాయి. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడి నామినేషన్ ప్రక్రియ కూడా ముగిసింది... దీంతో ఇకపై ప్రచార హోరు పెరగనుంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి నాయకులు ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు... కానీ ఇకపై హేమాహేమీలు రంగంలోకి దిగనున్నారు. తాజాగా బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా జూబ్లీహిల్స్ ప్రచారంలో పాల్గొననున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది... తమ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో మాజీ సీఎం పేరు చేర్చింది. ఇక ఇప్పటికే కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్స్ జాబితాలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఈ ఇద్దరి ఎంట్రీలో జూబ్లిహిల్స్ బైపోల్స్ మరింత హాట్ హాట్ గా మారనున్నాయి.

కేసీఆర్ ప్రచారంతో బిఆర్ఎస్ కు బలం..

జూబ్లీహిల్స్ బిఆర్ఎస్ సిట్టింగ్ సీటు. గత ఎన్నికల్లో ఇక్కడినుండి పోటీచేసి హ్యాట్రిక్ విజయం సాధించారు మాగంటి గోపినాథ్. అయితే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇటీవల ఆయన మరణించడంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీకి ఉపఎన్నిక అనివార్యం అయ్యింది. ఎట్టిపరిస్థితుల్లో సిట్టింగ్ సీటును వదులుకోవద్దని భావిస్తున్న బిఆర్ఎస్ మాగంటి గోపినాథ్ భార్య మాగంటి సునీతను బరిలోకి దింపింది. మాగంటి కుటుంబానికి నియోజకవర్గంపై ఉన్న పట్టు, భర్త చనిపోయిన మహిళ అన్న సానుభూతి కలిసివస్తాయని బిఆర్ఎస్ భావిస్తోంది. అదనంగా కేసీఆర్ ప్రచారంలో పాల్గొంటే పార్టీకి మరింత బలం చేకూరుతుందని భావిస్తున్నాయి బిఆర్ఎస్ శ్రేణులు.

మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావుగౌడ్, మహమూద్ అలీ, ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, జగదీశ్ రెడ్డి తో పాటు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మరికొందరు కీలక నాయకులు స్టార్ క్యాంపెయినర్స్ జాబితాలు ఉన్నారు. ఇలా 40 మందితో కూడిన బిఆర్ఎస్ క్యాంపెయినర్స్ లిస్ట్ ను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ ఎన్నికల కమీషన్ కు అందించారు... వీరి ప్రచారానికి ఈసి కూడా అనుమతి తెలిపింది.

కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా సీఎం రేవంత్ రెడ్డి

ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఈ జూబ్లీహిల్స్ ఉపఎన్నికను సీరియస్ గా తీసుకుంది. అధికారంలో ఉండటంతో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచితీరాలని భావిస్తోంది... అందుకోసమే అభ్యర్థి ఎంపిక విషయంలో తర్జనభర్జన పడింది. చివరకు జూబ్లీహిల్స్ రాజకీయాల్లో మంచి పట్టున్న నవీన్ యాదవ్ ను బరిలోకి దింపింది. ఇప్పటికే ఈయన భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ వేయడంతో పాటు ఎన్నికల ప్రచారంలో సినీతారలు, కీలక నాయకులను రంగంలోకి దింపుతున్నారు. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మరికొందరు మంత్రులు, సీనియర్ నాయకులు ఉన్నారు.

కేసీఆర్ vs రేవంత్ రెడ్డి

బిఆర్ఎస్ ఉపపోరులో కేసీఆర్ ప్రచారం చేయనుండటం ఖాయం కావడంతో ఎన్నికలు కీలకంగా మారాయి. ఇది కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్ పోటీ స్థాయినుండి కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి స్థాయికి చేరుకోనుంది. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరూ జూబ్లిహిల్స్ లో ఒకటిరెండు భారీ సభల్లో పాల్గొనే అవకాశాలున్నాయి. స్వయంగా సీఎం, మాజీ సీఎంల మధ్య రసవత్తర పోరు సాగితే ఈ జూబ్లీహిల్స్ బైపోల్ రెండు రాష్ట్రాల్లో మరింత హాట్ టాపిక్ గా మారనుంది.

ఇదిలాఉంటే బిజెపి కూడా ఇప్పటికే లంకల దీపక్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది... చివరిరోజు ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. బిజెపి తరపున పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాలకు చెందిన కీలక నాయకులు జూబ్లీహిల్స్ ప్రచారంలో పాల్గొనే అవకాశాలున్నాయి.