- Home
- Telangana
- Jubilee Hills Bypoll : బిజెపి అభ్యర్థి ఖరారు... ఎవరీ లంకల దీపక్ రెడ్డి? అతడి బలం, బలహీనతలేంటి?
Jubilee Hills Bypoll : బిజెపి అభ్యర్థి ఖరారు... ఎవరీ లంకల దీపక్ రెడ్డి? అతడి బలం, బలహీనతలేంటి?
Jubilee Hills Bypoll : జూబ్లిహిల్స్ ఉపఎన్నికలో బిజెపి లంకల దీపక్ రెడ్డిని బరిలోకి దింపుతోంది. ఇంతకూ ఆయన ఎవరు? బలాలు, బలహీనతలేమిటి? అనేది తెలుసుకుందాం.

జూబ్లీహిల్స్ బిజెపి అభ్యర్థి ఖరారు
Jubilee Hills Bypoll : తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక హీట్ పెంచింది. ఇప్పటికే ఈ ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడదలై నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది... ఈ క్రమంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి ప్రచారాన్ని కూడా ప్రారంభించాయి. కాస్త ఆలస్యమైన బిజెపి కూడా అభ్యర్థిని ప్రకటించి పోటీలోకి వచ్చింది... సీనియర్ నాయకుడు లంకల దీపక్ రెడ్డికి మరోసారి జూబ్లిహిల్స్ టికెట్ కేటాయించింది బిజెపి అదిష్టానం.
ఎవరీ లంకల దీపక్ రెడ్డి?
లంకల దీపక్ రెడ్డి... జూబ్లిహిల్ రాజకీయాల్లో గత రెండుమూడు దశాబ్దాలుగా కొనసాగుతున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీలో చాలాకాలం పనిచేసిన ఆయన బిజెపిలో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుండి పోటీచేసిన 25,866 ఓట్లు సాధించి మూడోస్థానంలో నిలిచారు. ఈ ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ గెలుపొందగా అజారుద్దిన్ రెండో స్థానంలో నిలిచారు.
ప్రస్తుతం దీపక్ రెడ్డి హైదరాబాద్ సెంట్రల్ బిజెపి అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. కేంద్ర మంత్రి, తెలంగాణ బిజెపి మాజీ అధ్యక్షులు కిషన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా పేరుంది. జూబ్లీహిల్స్ సీటుకోసం గట్టిపోటీ ఉన్నా బిజెపి దీపక్ రెడ్డికే సీటు దక్కడంవెనక కూడా కిషన్ రెడ్డి ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
దీపక్ రెడ్డి బలాలు
1. లంకల దీపక్ రెడ్డి చాలాకాలంగా జూబ్లీహిల్స్ రాజకీయాల్లో ఉన్నారు... నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడు. అలాగే గతంలో ఇక్కడినుండే పోటీచేశారు కాబట్టి ఏప్రాంతంలో పార్టీ బలంగా ఉంది... ఎక్కడ బలహీనంగా ఉంది అనేది తెలిసిన నాయకుడు. ఇలా జూబ్లీహిల్స్ లో రాజకీయాలపై మంచి పట్టు కలిగివుండటం దీపక్ రెడ్డి పెద్ద బలం.
2. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గం చదువుకున్నవారు ఎక్కువగా ఉండే ప్రాంతం. గ్రామీణ ప్రాంతాల్లో కంటే ఇలాంటి ప్రాంతాల్లో బిజెపికి ప్రజాధరణ ఎక్కువ. దీనికితోడు దీపక్ రెడ్డి లాంటి ప్రజానాయకుడు అభ్యర్థిగా ఉండటం మరింత కలిసివచ్చే అంశం. పార్టీతో పాటు సొంత ఇమేజ్ కలిగివుండటం దీపక్ రెడ్డికి మరింత బలమైన అభ్యర్థిగా గుర్తింపునిస్తోంది.
3. దీపక్ రెడ్డి గతంలో టిడిపి లో పనిచేశారు... ఆంధ్రా సెటిలర్స్ ఎక్కువగా ఉండే జూబ్లీహిల్స్ అసెంబ్లీలో ఇతడు పోటీచేయడం కలిసివచ్చే అంశం. గతంలో టిడిపిలో పనిచేసిన నాయకులు, కార్యకర్తలు దీపక్ రెడ్డి మద్దతుగా నిలిచే అవకాశాలుంటాయి.
కిషన్ రెడ్డి, రామచందర్ రావు జూబ్లిహిల్స్ సవాల్...
4. దీపక్ రెడ్డి వివాదారహితుడిగా పేరుంది... అంటే బిజెపి నాయకులందరితో అతడు సత్సంబంధాలు కలిగివున్నారు. కాబట్టి బిజెపి తెలంగాణ నాయకత్వమంతా అతడికోసం కలిసికట్టుగా పనిచేసే అవకాశాలున్నాయి. ఇక తనకు అత్యంత సన్నిహితుడు కాబట్టి దీపక్ రెడ్డి గెలిపించుకునేందుకు జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టవచ్చు.
5. తెలంగాణ బిజెపి అధ్యక్ష పగ్గాలను రామచందర్ రావు చేపట్టాక జరుగుతున్న మొదటి ఎన్నికలివి. కాబట్టి జూబ్లిహిల్స్ ఉపఎన్నిక ద్వారా తన సత్తా ఏంటో నిరూపించుకోవాలని ఆయన భావిస్తున్నారు. కాబట్టి దీపక్ రెడ్డి విజయంకోసం పార్టీ అధ్యక్షుడు సర్వశక్తులు ఒడ్డుతారు.
6. గత అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్, కాంగ్రెస్ హవా సాగినా ఇదే జూబ్లీహిల్స్ లో బిజెపి తరపున పోటీచేసిన దీపక్ రెడ్డి 25వేలకు పైగా ఓట్లు సాధించారు. దీన్నిబట్టి అతడి బలమేంటో తెలుస్తోంది. గతంలో పోటీచేసిన మాగంటి గోపినాథ్, అజారుద్దిన్ ఇద్దరూ ప్రస్తుతం బరిలో లేరు... దీపక్ రెడ్డి ఒక్కరే ప్రస్తుతం పోటీలో ఉన్నారు. ఎలక్షన్ మేనేజ్మెంట్ విషయంలో ఇది ఆయనకు కలిసివచ్చే అంశం.
లంకల దీపక్ రెడ్డి బలహీనతలు
1. దీపక్ రెడ్డి స్ట్రాంగ్ క్యాండిటేట్ గానే కనిపిస్తున్నా బిజెపి వీక్ గా కనిపిస్తోంది. ఇప్పటికే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ మధ్యనే జూభ్లీహిల్స్ లో పోటీ ఉందనే పొలిటికల్ వాతావరణం ఏర్పడింది. ఇలా బిజెపి బలహీనతే దీపక్ రెడ్డిని కూడా వీక్ చేస్తోంది.
2. బిజెపిలో అంతర్గత విబేధాలు కూడా జూబ్లిహిల్స్ ఎన్నికలపై ప్రభావం చూపించవచ్చు. ఉపఎన్నికలో సీటు ఆశించిన అభ్యర్థులు దీపక్ రెడ్డికి ఏమేరకు సహకరిస్తారన్నది కూడా కీలకం. వారిని సముదాయించి దీపక్ రెడ్డికి సహకరించాలని సూచించేవారు కూడా తెలంగాణ బిజెపిలో లేకుండాపోయారు. ఇలా బిజెపిలో బలమైన నాయకత్వం లేకపోవడం కూడా బలహీనతే.
3. బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు సానుభూతి పనిచేస్తుంది... నవీన్ యాదవ్ అధికార పార్టీ నుండి పోటీచేస్తున్నారు కాబట్టి అధికార, ధనబలం తోడవుతాయి. దీపక్ రెడ్డికి ఇలాంటి అడ్వాంటేజేస్ ఏమీ లేవు.
4. బిజెపి అధినాయకత్వం ఈ ఉపఎన్నికలను పట్టించుకోవడంలేదు. ఇక్కడ ఎన్నికల హడావిడి ఉంటే ప్రధాని మోదీ పక్కరాష్ట్రం ఏపీలో పర్యటనకు సిద్దమయ్యారు. దీన్నిబట్టి జూబ్లీహిల్స్ ఉపఎన్నికను బిజెపి లైట్ గా తీసుకుంటున్నారని అర్థమవుతోంది.
మొత్తంగా చూసుకుంటే లంకల దీపక్ రెడ్డి బలాలెన్నో బలహీనతలు కూడా అన్నే ఉన్నాయి. కాబట్టి గతంలో దుబ్బాక మాదిరిగా అధికార, ప్రతిపక్షాలను ఓడించి బిజెపి మ్యాజికల్ విక్టరీ సాధిస్తుందా? లేక మునుగోడు ఉపఎన్నిక మాదిరిగా బలమైన నాయకుడు బరిలో ఉన్నా ఓడిపోతుందా? అన్నది కాలమే నిర్ణయిస్తుంది. త్వరలోనే జూబ్లిహిల్స్ లో విజయం ఎవరిదో తేలిపోనుంది.