హ్యాట్రిక్ విజయంతో మూడో సారి కేసీఆర్ సీఎం కావడం ఖాయం.. : మంత్రి కేటీఆర్
Hyderabad: పొరుగున ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ వసూలు చేస్తోందని ఐటీ శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు (కేటీఆర్) ఆరోపించారు. అయితే, తెలంగాణలో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నాయకత్వంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రభుత్వం మెరుగైన పాలన అందిస్తున్నదని తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయంతో వరుసగా మూడో సారి కేసీఆర్ సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Telangana State IT minister KTR: తెలంగాణలో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నాయకత్వంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రభుత్వం మెరుగైన పాలన అందిస్తున్నదని ఐటీ శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు (కేటీఆర్)తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయంతో వరుసగా మూడో సారి కేసీఆర్ సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలందరూ సీఎం కేసీఆర్ కు మద్దతుగా ఉన్నారని తెలిపారు. దక్షిణ భారతదేశం నుంచి హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కానున్న తొలి వ్యక్తి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అవుతారని వ్యాఖ్యానించారు.
ఖమ్మం, సత్తుపల్లి పట్టణాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ సభలనుద్దేశించి మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కేసీఆర్‌కు ఓటు వేసి తెలంగాణ ప్రగతిలో అందరూ భాగమవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఖమ్మంలో దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే తెలుగువారికి గర్వకారణం ఎన్టీఆర్ అనీ, ఇప్పుడు యావత్ రాష్ట్రాన్ని తెలంగాణ వైపు చూసేలా ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నారన్నారు. ఎన్టీఆర్ గొప్ప నటుడని, నాయకుడని, అయితే హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కాలేకపోయారని అన్నారు.
ప్రజలందరి ప్రేమ, ఆదరణ, ఎన్టీ రామారావు ఆశీస్సులతో ఆయన అనుచరుడు కేసీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అవుతారని కేటీఆర్ అన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ఆరు హామీలను ప్రస్తావిస్తూ.. “కాంగ్రెస్ మూడు కమాండ్‌ల క్రింద పనిచేస్తోంది.. తెలంగాణలో లోకమాండ్, బెంగళూరులో కొత్త కమాండ్, న్యూ ఢిల్లీలో హైకమాండ్. వారి మధ్య ఏ విధమైన సమన్వయం లేదు” అని విమర్శించారు. కాంగ్రెస్ వారెంటీ గడువు ముగిసిందనీ, వారి హామీలను సీరియస్‌గా తీసుకోకూడదని ఆయన అన్నారు. ఆరు హామీలను గురించి ఆందోళన వ్యక్తంచేసిన కేటీఆర్.. కాంగ్రెస్‌కు పాలించే అవకాశం ఇస్తే, మూడు హామీలు జరుగుతాయనీ, అందులో రోజుకు మూడు గంటల విద్యుత్ సరఫరా, ప్రతి సంవత్సరం ముఖ్యమంత్రి మార్పు, రాష్ట్రంలో చాలా స్కామ్‌లు అంటూ ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో పర్యటిస్తున్న కాంగ్రెస్ నేతల గురించి మాట్లాడిన కేటీఆర్.. ‘సంక్రాంతి పండగకు ముందే పాటలు పాడేవాళ్లు ఇళ్లకు వస్తున్నారు’ అన్నట్టుగా ఈ నేతలు ఎన్నికల ముందు వస్తున్నారని, వాళ్లంతా తప్పుడు వాగ్దానాలు చేస్తున్నారని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ, వారి హామీల ఉచ్చులో పడవద్దని అన్నారు. కాంగ్రెస్ నేతలు కోట్ల రూపాయలకు టిక్కెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించిన కేటీఆర్.. భవిష్యత్తులో అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అమ్ముకుంటారని విమర్శించారు. ఆరు దశాబ్దాలుగా రూ.200 పింఛన్ ఇస్తున్న పార్టీ కాంగ్రెస్ అనీ, ఇప్పుడు రూ.4000 పింఛన్ ఇస్తామని హామీ ఇస్తున్నారని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ నాయకులను, వారి తప్పుడు వాగ్దానాలను నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు.