Asianet News TeluguAsianet News Telugu

నేటీతో ముగియ‌నున్న వజ్రోత్సవ వేడుకలు.. ముఖ్య అథితిగా సీఎం కేసీఆర్

తెలంగాణ ప్ర‌భుత్వం  రెండు వారాల పాటు నిర్వ‌హించిన స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు సోమవారంతో ముగియనున్నాయి. 

KCR to attend closing ceremony of Swatantra Bharat Vajrotsavalu
Author
Hyderabad, First Published Aug 22, 2022, 6:01 AM IST

భార‌త‌ దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తైనా సందర్భంగా తెలంగాణ‌ రాష్ట్ర ప్రభుత్వం రెండు వారాల పాటు స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నిర్వ‌హించింది. ఈ ఉత్స‌వాల‌ను ఆగ‌స్టు 8  నుంచి 22 వ‌ర‌కు జ‌రిగాయి. గ‌త రెండు వారాలుగా ప్రతి భార‌తీయుడి గుండెలో దేశ భక్తి ఉప్పొంగేలా నిర్వహించిన ఈ స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు సోమవారం (నేటీతో) తో ముగియనున్నాయి. స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదిక కానున్న‌ది.  ఈ ముగింపు వేడుక‌ల‌కు సీఎం కేసీఆర్  ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

ఈ ముగింపు వేడుక‌ల‌కు ఎల్బీ స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఈ వేడుకల ఏర్పాట్లను ఆదివారం సాయంత్రం సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ద‌గ్గ‌రుండి పరిశీలించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఎంపీపీలు, జడ్పీటీసీలు, డీసీసీబీ చైర్మన్లు, దేవస్థానం కమిటీ చైర్మన్లు, మున్సిపల్‌ కమిషనర్లు, మేయర్లు, జిల్లా కలెక్టర్లు సహా జిల్లా స్థాయి అధికారులు, తదితర ప్రజాప్రతినిధులు.. వీరితో పాటు హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల నుంచి సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూప్‌ల మహిళలు..  ఇలా మొత్తంగా 30 వేల మంది హాజరయ్యే అవ‌కాశ‌ముంది. 

సోమవారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుక‌ల్లో ముందుగా జాతిపిత‌ మహాత్మా గాంధీకి సీఎం కేసీఆర్‌ నివాళాల‌ర్పిస్తారు. అనంతరం జాతీయ గీత ఆలాపనతో ఈ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ కార్య‌క్ర‌మంలో ప్రముఖ సంగీత దర్శకుడు శంకర్‌ మహదేవన్‌, సంగీత సంగీత వియిద్యాకారుడు శివమణి సంగీత‌ ప్ర‌ద‌ర్శ‌నలు హైలెట్ గా నిలువ‌నున్నాయి. అలాగే..  పద్మశ్రీ పద్మజారెడ్డి బృందం శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు, వార్సీ బ్రదర్స్‌ ఖవ్వాలీ, జాతీయ‌, స్థానిక కళాకారుల ప్రదర్శనల్లో కార్య‌క్ర‌మం కొన‌సాగ‌నున్న‌ది.  

అంతేకాకుండా.. ఈ కార్య‌క్ర‌మంలో స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను గౌరవిస్తూ వారి కుటుంబ సభ్యులను తెలంగాణ‌ ప్రభుత్వం సన్మానించనున్నది. వీరిలో సురవరం ప్రతాపరెడ్డి మనుమడు అనిల్‌కుమార్‌రెడ్డి, భాగ్యరెడ్డివర్మ మనుమడు అజయ్‌ గౌతమ్‌, గల్వాన్‌ లోయలో ప్రాణాలు కోల్పోయిన కర్నల్‌ సంతోష్‌బాబు సతీమణి,   అలాగే.. కుమ్రం భీం మనుమడు కుమ్రం సోనేరావు, వనజీవి రామయ్య, వీరితో పాటు  తెలంగాణకు చెందిన జాతీయ, అంత‌ర్జాతీయ‌ క్రీడాకారులను సీఎం కేసీఆర్ సన్మానిస్తారు. తెలంగాణ రాష్ట్ర‌ప్ర‌భుత్వ అధ్వ‌ర్యంలో రెండు వారాల పాటు వ‌జ్రోత్స‌వ వేడుక‌ల్లో నిర్వ‌హించిన ప‌లు కార్యక్ర‌మాల‌ను తెలిపే లఘు వీడియో ప్రదర్శించ‌నున్నారు. అనంతరం లేజర్ షోతో వజ్రోత్సవాలు ముగుస్తాయి.   

Follow Us:
Download App:
  • android
  • ios