Asianet News TeluguAsianet News Telugu

కెసిఆర్ మరో అశోక చక్రవర్తి

తెలంగాణ సిఎం కెసిఆర్ పై పార్టీ నేతలు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. నేతలు పోటాపోటీగా కెసిఆర్ ను కీర్తిస్తున్నారు. కొంత మంది నాయకులైతే కెసిఆర్ ను దేవుళ్లతోనూ పోలుస్తూ తమ స్వామి భక్తిని చాటుకుంటున్నారు. ఇటీవల ఒక నాయకుడు కెసిఆర్ మరో కొమరెల్లి మల్లన్న అని కొనియాడారు. గతంలో ఒక నాయకుడు కెసిఆర్ మరో ఏసుక్రీస్తు అంటూ కీర్తించారు. ఇప్పుడు పార్టీ నేతలకు కెసిఆర్ అశోక చక్రవర్తి పాత్రలో  కనిపిస్తున్నాడట.

kcr the grate is our ashoka says karne

తాజాగా టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ కెసిఆర్ మీద వరాల జల్లు కురిపించి అందరినీ ప్రాచీన కాలంలోకి తీసుకెళ్లారు. కెసిఆర్ అశోక చక్రవర్తి లాంటి మహా వ్యక్తి అని పొగడ్తలు గుప్పించారు కర్నె. తెలంగాణలో హరిత హారం పేరుతో 230 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా కెసిఆర్ పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు కర్నె.

 

ప్రాచీన కాలంలో అశోక చక్రవర్తి కూడా రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటించాడని పుస్తకాల్లో చదువుకున్నాం. అశోకుడు చెట్లు నాటించెను అని సినిమా పాటలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో కెసిఆర్ ను అశోకుడితో పోలుస్తూ టిఆర్ఎస్ నాయకులు కామెంట్లు చేయడం చర్చనీయాంశమైంది.

 

ఈనెల 12న కెసిఆర్ కరీంనగర్ లో స్వయంగా హరితహారంలో పాల్గొని మొక్కలు నాటేందుకు సర్కారు ప్లాన్ చేస్తోంది. లక్ష మందిని అక్కడికి తరలించి భారీ కార్యక్రమం చేపట్టేందుకు పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. అందుకే కెసిఆర్ ఆలోచనా విధానం అశోక చక్రవర్తి ఆలోచనా విధానంతో సమానంగా ఉందని కర్నె ప్రకటించేశారు.

 

హరిత హారం పేరుతో ఇప్పటి వరకు తెలంగాణ సర్కారు 1700 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. సర్కారు లక్ష్యం 230 కోట్ల మొక్కలు నాటుడు బాగానే ఉంది కానీ వాటిలో ఎన్ని మొక్కలను వృక్షాలుగా మలుస్తారన్నది ఆలోచించాల్సిన ముచ్చట. ఎందుకంటే గతంలో పాలకులు మొక్కలు నాటి మరచిపోయిన దాఖలాలున్నాయి. మరి ఆకుపచ్చ తెలంగాణలో ఎన్ని మొక్కలు ఎన్ని వృక్షాలవుతాయో చూడాలి మరి.

Follow Us:
Download App:
  • android
  • ios