తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా నిర్దేశించిన ముహూర్తం ప్రకారం మధ్యాహ్నాం 1.25 గంటలకు రాజ్‌భవన్‌లో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహాన్ ఆయనతో ప్రమాణం చేయించారు.

కేసీఆర్ తర్వాత మొహమూద్ అలీ ప్రమాణం స్వీకారం చేశారు. కేసీఆర్ తెలుగులో దైవసాక్షిగా ప్రమాణం చేయగా, మొహమూద్ అలీ ఉర్దూలో ప్రమాణం చేశారు. అనంతరం వీరిద్దరికి గవర్నర్ నరసింహాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమానికి కేటీఆర్, హరీశ్ రావు, నిజామాబాద్ ఎంపీ కవితతో పాటు మిగిలిన కుటుంబసభ్యులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేసీఆర్ ప్రమాణం చేసిన సమయంలో రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నాయి. ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత కేసీఆర్ తన కుటుంబసభ్యులతో కలిసి నేరుగా ప్రగతి భవన్‌కు బయలుదేరారు.

""