కర్ణాటక మోడల్: కేసీఆర్ వ్యూహం ఇదీ, కాంగ్రెసుకు ఇలా చెక్

KCR strategy to keep away Congress fron power
Highlights

జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ వ్యూహంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు కచ్చితమైన వ్యూహం ఉన్నట్లు కనిపిస్తోంది.

హైదరాబాద్: జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ వ్యూహంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు కచ్చితమైన వ్యూహం ఉన్నట్లు కనిపిస్తోంది. కర్ణాటక నమూనానే జాతీయ స్థాయిలో అమలు చేయాలని ఆయన ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. బిజెపినే కాకుండా కాంగ్రెసును కూడా కేంద్రంలో అధికారానికి దూరం చేసేందుకు ఆ నమూనా పని చేస్తుందని ఆయన అనుకుంటున్నట్లు సమాచారం.

2019 లోకసభ ఎన్నికల్లో కాంగ్రెసు, బిజెపిల్లో ఏ పార్టీకి అత్యధిక సీట్లు వచ్చినా కర్ణాటక నమూనాను అమలు చేయడం ద్వారా ప్రాంతీయ పార్టీల కూటమి అధికారం చేపట్టడానికి వీలవుతుందని ఆయన అంచనా వేస్తున్నట్లు సమాచారం.

బిజెపి, కాంగ్రెసు బద్ధశత్రువులు. ఈ రెండు పార్టీలు ఒక్కటయ్యే అవకాశాలు లేవు. ఈ స్థితిలో కర్ణాటకలో మాదిరిగా ఆ పార్టీలు అనివార్యంగా ప్రాంతీయ పార్టీలతో కూడిన కూటమికి అధికారాన్ని అప్పగించే అనివార్య పరిస్థితిని కల్పించాలనేది కేసీఆర్ వ్యూహంగా చెబుతున్నారు. 

ఇప్పటికే పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించిన కేసిఆర్ జూన్ లో మరిన్ని రాష్ట్రాల్లో పర్యటించి ఆగస్టులో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కేసిఆర్ కొంత మంది మంత్రులు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సమావేశమై ఆ విషయంపై చర్చించారు.

కర్ణాటకలో జెడిఎస్ అధికారంలోకి వస్తుందని తాను చెప్పిన విషయాన్ని సమావేశంలో ఆయన గుర్తు చేశారు. గత నెలలో తాను బెంగళూరు వెళ్లినప్పుడు కర్ణాటకలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని జర్నలిస్టులు అడిగితే జెడిఎస్ కీలక పాత్ర పోషిస్తుందని తాను చెప్పినప్పుడు వారు నవ్వారని ఆయన గుర్తు చేశారు. అది నిజమవుతుందని, ఎన్నికలు ముగిసిన తర్వాత ఇక్కడికి మళ్లీ వస్తానని చెప్పానని, ఇప్పుడు జెడిఎస్ కింగ్ మేకర్ కాకుండా కింగ్ అయిందని ఆయన అన్నారు. 

కేంద్రంలో 2019లో ప్రాంతీయ పార్టీలు ఏ విధమైన పాత్ర నిర్వహించవచ్చుననేది కర్ణాటక చేసి చూపిందని ఆయన అన్నారు. ఏ జాతీయ పార్టీకి మెజారిటీ రాదని, ఆ స్థితిలో ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషించడానికి అవకాశం చిక్కుతుందని ఆయన అన్నారు. 

కేసిఆర్ ప్రస్తుతం ఫెడరల్ ఫ్రంట్ ఉమ్మడి ప్రణాళిక ముసాయిదాను రూపొందించే పనిలో ఉన్నారని సమాచరాం. ఫెడరల్ ఫ్రంట్ కార్యరూపం ధరిస్తుందనే ఆశతో ఆయన ఉన్నారు. ఫెడరల్ ఫ్రంట్ లోకి కాంగ్రెసును తీసుకోవడానికి ఆయన ఇష్టపడడం లేదు.

బిజెపిని ఎదుర్కోవడానికి తృణమూల్, డిఎంకె, సమాజ్ వాదీ పార్టీ, బిఎస్పీ, జెడిఎస్ కాంగ్రెసుతో కలిసి నడవాలనే అభిప్రాయంతో ఉన్నాయి. అయితే, ఆయా రాష్ట్రాల్లో అవసరమైతే ప్రాంతీయ పార్టీలు కాంగ్రెసుతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగవచ్చు. కానీ, చివరగా, ప్రాంతీయ పార్టీల కూటమి కీలక పాత్ర పోషించాలనేది కేసిఆర్ వ్యూహంగా చెబుతున్నారు.

loader