పరిటాల పెళ్లిలో కేసిఆర్ కొత్త ఆకర్షణ చూసేందుకు ఎగబడ్డ సీమ జనాలు కేసిఆర్ కు జేజేలు పలికిన అనంతపురం
తెలంగాణ సిఎం కేసిఆర్ కు సీమాంధ్ర ప్రజలు జేజేలు పలికిన పరిస్థితి నెలకొంది. ఆదివారం రాయలసీమలో పరిటాల శ్రీరాం పెళ్లికి హాజరయ్యారు కేసిఆర్. అనంతపురం జిల్లాలోని వెంకటాపురం గ్రామంలో జరిగిన పెళ్లి వేడుకల్లో కేసిఆర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా పెళ్లి వేదిక మీదుగా కేసిఆర్ పెళ్లి వేడుకలో పాల్గొన్న వారికి విక్టరీ గుర్తు చూపారు. దీంతో పెళ్లి వేడుకలో ఉన్న వారంతా ఒక్కసారిగా ప్రతిగా కేసిఆర్ కు అభివాదం చేశారు. దీంతో పెళ్లిలో కేసిఆర్ ఉన్నంత సేపూ కోలాహలం నెలకొంది. తెలంగాణ తెచ్చిన యోధుడిగా రాయలసీమ ప్రజలు కేసిఆర్ ను చూసేందుకు ఎగబడ్డారు.

పరిటాల శ్రీరాం పెళ్లి వేడుకలో కేసిఆర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పెళ్లికి వచ్చి వధూవరులను ఆశీర్వదించగానే శ్రీరాం, ఆయన సతీమణి ఇద్దరూ కేసిఆర్ కు పాదాభివందనాలు చేయడంతో అక్కడ కొత్త వాతావరణం నెలకొంది.
గతంలో కేసిఆర్ టిడిపి నేతగానే అనంతపురం వాసులకు తెలుసు. పరిటాల రవీంద్రతో అత్యంత సన్నిహితంగా ఉండేవాడు కేసిఆర్. దీంతో ఆ చనువు, స్నేహం కారణంగానే ఆదివారం జరిగిన పరిటాల కొడుకు పెళ్లికి ప్రత్యేక విమానంలో, హెలిక్యాప్టర్ లో వెళ్లారు కేసిఆర్.

తెలంగాణ రాకముందు కేసిఆర్ పట్ల వ్యతిరేక భావంతో ఉండేవారు సీమాంధ్రలో ప్రజలు కూడా. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత వ్యతిరేక భావం తగ్గిపోయి కేసిఆర్ కు నీరాజనాలు పలుకుతున్న పరిస్థితి నెలకొంది. గతంలో కేసిఆర్ ఆంధ్రాకు వెళ్లినా, తిరుమల వెళ్లినా అంతే స్థాయిలో స్థానిక నేతకు ఉన్న ఫాలోయింగే కనిపించింది.

తాజాగా అనంతపురం శ్రీరాం వేడుకలోనూ కేసిఆర్ కు జనాల్లో ఏమాత్రం క్రేజ్ ఉందో తెలిసిపోయిందని అంటున్నారు. కేసిఆర్ గురించి వినడమే కాని ప్రత్యక్షంగా చూసిన దాఖలాలు లేకపోవు అనంతపురం వాసులకు. దీంతో ఇవాళ కేసిఆర్ అక్కడ పర్యటించడంతో కేసిఆర్ ను చూసేందుకు, ఆయనతో ముచ్చటించేందుకు ఆసక్తి ప్రదర్శించారు పరిటాల పెళ్లికి వచ్చిన అనంత జనాలు.
