తెలంగాణాలో గ్రేటర్ ఎన్నికల ఫలితాలు తెరాస కు ఒక రకంగా షాక్ అని చెప్పక తప్పదు. గతంలో 99 సీట్లను కలిగిన తెరాస ఈ సారి 100 సీట్లను గెలుస్తామని ధీమాను వ్యక్తం చేసారు. కానీ ఫలితాల్లో మాత్రం వారు వెనుకబడ్డట్టుగానే కనబడుతున్నారు.

మేయర్ పీఠం తెరాస కే దక్కుతుందనడంలో ఎటువంటి సంశయం లేకున్నప్పటికీ... మేజిక్ ఫిగర్ ని అందుకోవడానికి ఎక్స్ అఫిషియో ఓట్లను ఉపయోగించవలిసి రావడం మాత్రం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 

సాధారణంగా ఇలాంటి పరిస్థితి గనుక ఎదురైతే తెరాస ఆపరేషన్ ఆకర్ష్ అనే అస్త్రాన్ని ప్రయోగిస్తుంటుంది. ఆమాటకొస్తే అధికారంలో ఉన్న అన్ని పార్టీలు ఈ విధమైన ఆపరేషన్లు చేయడం మనం చూస్తూనే ఉన్నాము. కేసీఆర్ 2014లో తొలిసారి అధికారాన్ని చేపట్టినప్పుడు ఈ ఆపరేషన్ ని మొదలుపెట్టారు. 

ఆ ఎన్నికల తరువాత రాష్ట్రంలో టీడీపీని నామరూపాలు లేకుండా చేయాలన్న సంకల్పంతో విస్తృతమైన ప్రణాలికను ఆచరణలో పెట్టారు. టీడీపీ నాయకులను కార్ ఎక్కించడంతోపాటుగా, టీడీపీకి వెన్నుదన్నుగా ఉన్న బీసీలను కూడా తమవైపుగా తిప్పుకున్నారు కేసీఆర్. 

ఇక ఆ తరువాత నెక్స్ట్ ఎన్నికల నాటికి తన ఫోకస్ ని కాంగ్రెస్ మీదకు మళ్లించారు. 2018 ఎన్నికలకు ముందే కాంగ్రెస్ ను దాదాపుగా ఖాళీ చూపించినంత పనిచేసారు. సాధ్యమైనంతమంది కాంగ్రెస్ నాయకులూ కారెక్కేసారు. వారు అభివృద్ధి చూసి కారెక్కారా, లేదా పరిస్థితుల ప్రభావం వల్లనా అనే విషయం పక్కనబెడితే వారైతే గులాబీ ఖండువా కప్పుకున్నారు 

కాంగ్రెస్ ఖాళీ అవడంతో ప్రతిపక్ష స్థానాన్ని బీజేపీ భర్తీ చేసింది. కానీ ఇప్పుడు కేసీఆర్ అదే అస్త్రాన్ని బీజేపీపై ప్రయోగించలేకపోతున్నారు. దీనికి మనకు పోరాధనంగా రెండు కారణాలు కనబడుతున్నాయి. మొదటగా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండడం. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండడం వల్ల ప్రతిపక్షంలో ఉన్నవారికి అవసరమైన సో కాల్డ్ కేసుల నుండి రక్షణ లభిస్తూనే ఉంటుంది. 

ఇక రెండవది బీజేపీ సైద్ధాంతిక భావజాలం. బీజేపీ సైద్ధాంతిక భావజాలం, ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చినవారు అంత ఈజీగా పార్టీలు మారరు. తెలంగాణాలో బీజేపీ నేతల్లో చాలామంది (డీకే అరుణ, జితేందర్ రెడ్డి వంటివారు )బీజేపీ ఐడియాలజీ నుంచి వచ్చినవారు కాకపోయినా వారు కేసీఆర్ వ్యతిరేకులు. కాబట్టి ఈ పరిస్థితుల్లో కేసీఆర్ పాచిక అక్కడ పారే ఆస్కారం కనబడడంలేదు.