ప్రగతి భవన్‌లోని జనహితలో శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు వేదపండితులు వేదాశీర్వచనం అందించారు.
తెలంగాణలో ఉగాది సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రగతి భవన్‌లోని జనహితలో శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం శుభకృత్ నామ సంవత్సర ఉగాది పంచాంగాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగ పఠనం చేశారు. ఈ ఏడాదంతా మంచి జరగబోతుంది.. సీఎం కేసీఆర్ మంచి పాలన అందిస్తారని చెప్పారు. పంటలు బాగా పండుతాయి.. రైతులు రాజులు కాబోతున్నారని తెలిపారు. ప్రజారోగ్యం బాగుంటుందన్నారు. వాగ్దాటి గల వ్యక్తులకు రాజా యోగం ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో వేసవిలోనూ సమృద్దిగా నీళ్లు ఉంటాయన్నారు. హైదరాబాద్ ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకుంటుందన్నారు.
ఇకపై ఆన్‌లైన్ తరగతులు ఇక ఉండవన్నారు. ఇది ఉద్యోగనామ సంవత్సరం అని చెప్పారు. 75 శాతం మంచి ఫలితాలు కనిపిస్తుండగా... 25 శాతం వ్యతిరేకంగా ఉన్నట్లు తెలిపారు. పార్టీ ఫిరాయించవద్దని రాజకీయ పార్టీల నేతలను శర్మ నేతలనుహెచ్చరించారు. పార్టీ ఫిరాయించిన వారికి రాజకీయంగా ఇబ్బందులు తప్పవని అన్నారు. రాజకీయంగా పెను మార్పులు చోటుచేసుకుంటాయన్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం.. పాకిస్తాన్‌తో యుద్ద వాతావరణం ఉంటుందన్నారు. భారతదేశపు అతిపెద్ద పదవి.. తెలంగాణ ప్రభుత్వంలో కొన్ని కీలక పదవులు ఈ సంవత్సరం మహిళల దక్కించుకునే అవకాశం ఉందన్నారు.
రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ దూసుకెళ్తుందన్నారు. కొన్ని చోట్ల రైలు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అన్నారు. ప్రజలు ఆర్థిక క్రమశిక్షణను పాటించకుంటే శ్రీలంక పరిస్థితి వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ జాతకం గత సంవత్సరం కంటే బాగుంటుందని తెలిపారు. ప్రత్యర్ధులు ఇబ్బందులు పెట్టినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. కేసీఆర్ కొన్ని పెద్ద ప్రకటనలు చేసి దేశం దృష్టిని ఆకర్షిస్తారని చెప్పారు.
సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. ప్రజలందరికీ సుఖం, శాంతి, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు. ప్రజల మద్దతు, దేవుడి ఆశీస్సులతో ముందుకెళ్తున్నామని అన్నారు. 15 ఏళ్ల సుదీర్ఘ పోరాటం వలన తెలంగాణ సాకారమైందని గుర్తుచేశారు. అనేక అనుమానాలను అధిగమించి తెలంగాణను సాధించామన్నారు. రాష్ట్రంలో అద్భుతమైన సంపద సృష్టి జరుగుతుందన్నారు. సమైక్య రాష్ట్రంలో కన్నా అభివృద్దిలో తెలంగాణ దూసుకుపోతుందన్నారు. కొందరు ఆటంకాలు కల్పించినా ముందుకు వెళ్తున్నామని చెప్పారు.
రాష్ట్రంలో అనేక విషయాల్లో అద్భుతాలు జరిగాయని కేసీఆర్ చెప్పారు. తెలంగాణలో భూముల ధరలు చాలా పెరిగాయని అన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ది వల్లే భూముల ధరలు పెరిగాయన్నారు. దేశానికి ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ మారుతోందని తెలిపారు. వనరులు, వసతులు, అవకాశాలు అన్ని కోల్పోతున్నామని ఆవేదనలో ఉన్న తెలంగాణలో.. నేడు అటెండర్ నుంచి ఆర్టీవో వరకు
95 శాతం స్థానికులకే ఉద్యోగాలు కల్పిస్తున్నామని చెప్పారు.
తెలంగాన బడ్జెట్ రెండున్నర లక్షల కోట్లు రూపాయలని.. దేశంలో ఏ రాష్ట్రం సాధించని ప్రగతి తెలంగాణ సాధించిందన్నారు. దళిత బంధు చాలా అద్భుతాలు ఆవిష్కరించబోతుంది. మొట్టమొదటి సారిగా తెలంగాణలో దళిత బిడ్డలకు ఇలాంటి అవకాశం లభించందన్నారు. అద్భుత తెలంగాణను ఆవిష్కరించబోతున్నామని అన్నారు. దేశానికే తెలంగాణ కొత్త మార్గనిర్దేశనం చేయబోతుందని వ్యాఖ్యానించారు. దేశంలో ఎవరూ చేయని సహాసం తాము చేశామని.. దళిత బంధు ఎన్నికల కోసం, ఓట్ల కోసం తెచ్చినా పథకం కాదని చెప్పారు. జాతి, కుల, మత వివక్షలేకుండా ముందుకు సాగుతున్నామని చెప్పారు.
