ఆర్టీసి వర్కర్స్ పై కేసిఆర్ సీరియస్

kcr serious on rtc workers
Highlights

ఇబ్బడి ముబ్బడిగా జీతాలు పెంచాలా ?

ఆర్టీసి కార్మికులపై తెలంగాణ సిఎం కేసిఆర్ కన్నెర్రజేశారు. ఇప్పటికే ఆర్టీసి అప్పుల్లో కూరుకుపోయిన సందర్భంలో ఉద్యోగులు, కార్మికులు జీతాలు ఇబ్బడి ముబ్బడిగా పెంచాలని డిమాండ్ చేయడం అసమంజసమని, అసంబద్ధమని కేసిఆర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాయలం నుంచి ఈ విషయమై ఒక ప్రకటన వెలువడింది. పూర్తి ప్రకటన కింద ఉంది చదవండి.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాద్యాయుల డిమాండ్లపై రేపు బుధవారం జరగబోయే సమావేశం విషయంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులతో, కేబినెట్ సబ్ కమిటీ సభ్యులతో చర్చిస్తున్న సందర్భంగా రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగుల ప్రతిపాధిత సమ్మె నోటీస్ ప్రస్తావనకు వచ్చింది. ఈ పాటికే సంవత్సరానికి సుమారు 2,800 కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయిన నేపథ్యంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు తమ జీతాలను ఇబ్బడి ముబ్బడిగా పెంచమని డిమాండ్ చేయటం అసమంజసంమనీ, అసంబద్దమనీ ముఖ్యమంత్రితో సహా కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు ఆర్టీసీ ఉన్నత అధికారులు అభిప్రాయపడ్డారు.

చరిత్రలో ఎన్నడూ కనివిని ఎరగని విధంగా ఆర్టీసీ ఉద్యోగులకు లోగడ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 44శాతం ఫిట్ మెంట్ ఇవ్వడాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసారు. ఆ తర్వాత ఒక రోజంతా ఆర్టీసీ ఉద్యోగులతో సమావేశం జరిపి సంస్థను లాభాల్లోకి తీసుకరావాల్సిన అవసరాన్ని నొక్కి వొక్కాణించినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. అదే విధంగా 4,200 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించామని అన్నారు. ఇంత జరిగినా అనాలోచితంగా వారు డిమాండ్ చేస్తూ సమ్మె నోటీసు ఇవ్వడం తగదని ముఖ్యమంత్రి అభిప్రాయం వెల్లిబుచ్చారు.

ఆర్టీసీ ఉద్యోగులు కోరిన స్థాయిలో జీతాలు పెంచినట్లైతే ప్రస్తుతం ఏడాదికి వారి జీతాలపై ఖర్చు చేస్తున్న రూ. 2400 కోట్లకు అదనంగా మరో రూ.1400 కోట్లు సంవత్సరానికి ఖర్చు చేయాల్సి ఉంటుంది. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు లాంటి పొరుగు రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థల ఉద్యోగుల జీతబత్యాలతో పోల్చి చూస్తే టీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు ఎక్కువ. ఉదాహరనకు ఆర్టీసీ డ్రైవర్ జీతం తీసుకుంటే తెలంగాణలో కనీస మూలవేతనం రూ. 12,610 ఉండగా, కర్ణాటకలో అంతకంటే తక్కువగా రూ. 11610 , మహారాష్ట్రలో రూ.4350 మాత్రమే ఉంది. తమిళనాడులో కూడా తెలంగాణ కంటే తక్కువేనని ఆర్టీసీ అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకవచ్చారు. ‘‘కేవలం జీతబత్యాల మీదనే ఆర్టీసీ సంస్థ తన ఆదాయంలో 52 శాతం పైగా ఖర్చు పెడుతున్నది. మరే ప్రభుత్వ రంగ సంస్థ కూడా ఇంత పెద్ద మొత్తంలో జీతాల మీద ఖర్చు పెట్టడంలేదు. 2014-15లో 44శాతం ఫిట్ మెంట్ ప్రకటించినప్పుడు  ఆర్టీసీ సంస్థను లాభాల్లో నడిపిస్తామని ఉద్యోగ సంఘాల నాయకులు హామి ఇచ్చారు. కానీ ఆ హామీకి విరుద్ధంగా 2014-15లో రూ.400 కోట్లకు పైగా 2015-16లో రూ.776 కోట్లకు పైగా, 2016-17లో రూ. 750 కోట్ల మేరకు, 2017- 2018లో రూ.680 కోట్ల మేరకు సంస్థ నష్టాల్లో కూరుకుపోయింది.’’ అని సిఎం అన్నారు.

ఈ నేపథ్యంలో ఇవేవీ గమనించ కుండా మళ్లీ జీతాలు పెంచమని డిమాండ్ చేయడాన్ని సమావేశంలో పాల్గొన్న అధికారులు, కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు, ముఖ్యమంత్రి తప్పుబట్టారు. ఇది అసమంజసమైన డిమాండ్ అని వారు పేర్కొన్నారు. నష్టాల్లో నిరంతరం కూరుకుపోతున్న ఆర్టీసీ సంస్థను ప్రభుత్వం నడపాలా వద్దా అని ఉద్యోగులు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందని సిఎం అన్నారు.

సమీక్షా సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు మంత్రులు ఈటల రాజేందర్, జగదీష్ రెడ్డి, మహేందర్ రెడ్డి, ఛైర్మన్ సోమారపు సత్యనారాయణ ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె జోషి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు,  కార్యదర్శి శివశంకర్, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, ఆర్టీసీ ఎండీ రమణారావు, సిఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.

loader