సరుకు రవాణా కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ కార్గో బస్సులపై తన ఫోటోలను ముద్రించడాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి తప్పుపట్టారు. తనకు ఇలాంటి చౌకబారు ప్రచారం నచ్చదంటూ ఆయన మండిపడటం గమనార్హం.

ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ద్వారా ప్రజలకు సేవలందించాలే తప్ప, ఇలాంటి చౌకబారు ప్రచారం పొందడం తన అభిమతం కాదని స్పష్టం చేశారు. మొత్తం 822 బస్సులను కార్గో సేవలకు వినియోగించాలని నిర్ణయించినా, ఇప్పటి వరకు 52 బస్సులు మాత్రమే సిద్ధమయ్యాయి.

Also Read త్వరలో టిఆర్ ఎస్ ప్రజాప్రతినిధుల సభ: దిశా నిర్దేశం చేయనున్న కెసిఆర్.

అంతేకాకుండా ఎర్ర రంగులో ఉన్న ఈ కార్గో బస్సులపై ఇరువైపులా సీఎం కేసీఆర్ ఫోటోలను ముద్రించారు.  అంతేకాదు, ఆర్టీసీ సాధారణ బస్సులపై కూడా కేసీఆర్‌ ఫొటోలను ముద్రించే ఏర్పాట్లు చేస్తున్నారు.
 
దీనిపై వ్యతిరేకత రావడంతో కేసీఆర్‌ తీవ్రంగా స్పందించారు. సీఎం కేసీఆర్ ఫోటోలను ముద్రించడంపై కొన్ని మీడియా సంస్థలు తప్పపడుతూ వార్తలు ప్రచురించాయి. దీంతో దీనిపై కేసీఆర్ స్పందించారు .

ఇలాంటి ఫొటోలను ముద్రించవద్దంటూ ఆదేశించారు. కార్గో బస్సులపై ఫొటో పెట్టడాన్ని కేసీఆర్‌ తప్పుబట్టారని సీఎంవో ప్రత్యేక కార్యదర్శి రాజశేఖరరెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘బస్సులపై ఫొటోలు వేయించుకుని ప్రచారం చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఈ ప్రతిపాదన ఆమోదయోగ్యం కాదని’ సీఎం స్పష్టం చేసినట్లు వివరించారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీకి ఒక నోట్‌ కూడా పంపారు.