అధికార పార్టీ నేతలతో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో దాదాపు అన్ని ఎన్నికలు పూర్తవడంతో ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు అందరిని ఒకే చోట సమావేశపరిచి ప్రభుత్వ ప్రాధాన్యతను వివరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

 ఎమ్మెల్యే, ఎంపీల ఎన్నికల అనంతరం రాష్ట్రంలో స్థానిక సంస్థలు , మున్సిపల్  కార్పొరేషన్లకు ఎన్నికలు పూర్తయ్యాయి.

 స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో సర్పంచులు, ఎంపీటీసీలు జడ్పీటీసీలు, దాదాపు పదివేల మంది వరకు టిఆర్ఎస్ పార్టీ తరపున విజయం సాధించారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా మూడు వేల పైచిలుకు అభ్యర్థులు గెలుపొందారు. త్వరలో సహకార సంఘాల ఎన్నికలు రాబోతున్నాయి. వీటిలో కూడా మెజారిటీ స్థానాలు దక్కుతాయని టిఆర్ ఎస్ అంచనా వేసస్తోంది.

 దీంతో దాదాపు 20 వేల మంది ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ కు రాష్ట్రంలో వివిధ స్థాయిల్లో ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కింది.

 వీరందరికి ఒకేచోట సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వపరంగా తీసుకుంటున్న నిర్ణయాలు.... స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాత్ర అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ప్రజా ప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.

 ప్రభుత్వం ఇటీవల చేసిన రెండు కీలక చట్టాలపై ఈ సమావేశంలో ప్రధానంగా ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించాలని భావిస్తున్నట్టు సమాచారం.

 గ్రామాలను అభివృద్ధికి చేపట్టిన పల్లె ప్రగతి, పట్టణ అభివృద్ధికి చేపట్టదలచిన పట్టణ ప్రగతి కార్యక్రమాలను వివరిస్తూ ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధుల పాత్రపై  స్పష్టత ఇవ్వాలని అధికార పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

 కొత్తగా రూపొందించిన చట్టాల ప్రకారం ప్రజా ప్రతినిధులు సమర్థవంతంగా తమ బాధ్యతలు నిర్వహించకపోతే వారిని ఆ పదవుల నుంచి తొలగించే అధికారం కూడా ఈ చట్టానికి ఉంది. దీనిపై అధికార పార్టీ ముందుగా తమ నేతలను అప్రమత్తం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తొంది.

 గతంలో ఏ రాజకీయ పార్టీ కూడా క్షేత్రస్థాయిలో ప్రజా ప్రతినిధులు ఈ స్థాయిలో  లేకపోవడం తొలిసారి భారీ ఎత్తున ప్రజాప్రతినిధులకు ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించడంతో ప్రజలకు అందించే సేవలపై ప్రజాప్రతినిధులు ఎలా నడుచుకోవాలి అనే అంశంపై కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి దిశానిర్ధేశం చేయనున్నట్లు తెలుస్తోంది.