హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. చావు నోట్లో తలపెట్టిన కేసీఆర్ వారికి లొంగుతాడా అని ఆయన ప్రశ్నించారు. తాము అధికారంలో లేని రాష్ట్రాల్లో గల ప్రభుత్వాలను నిర్వీర్యం చేయాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చూస్తోందని ఆయన అన్నారు. 

ఇతర పార్టీల ప్రభుత్వాలను కూలదోసి, తమ పార్టీని అధికారంలోకి తేవడానికి బిజెపి చేయని ప్రయత్నమంటూ లేదని ఆయన అన్నారు. కర్ణాటక, గోవా, మధ్యప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాల్లో బిజెపి పన్నాగాలు ఫలించాయని, రాజస్థాన్ లో వారి ప్రయత్నాలు ఫలించలేదని, మహారాష్ట్రలోూ చేతులు కాల్చుకున్నారని ఆయన అన్నారు. 

రాష్ట్రాలను తమ అదుపాజ్ఞల్లో పెట్టుకోవాలని కేంద్రం చూస్తోందని ఆయన అన్నారు. కేంద్రంలో పనికిమాలిన ప్రభుత్వం ఉందని, ఆ ప్రభుత్వం చెప్పే విషయాల్లో 99 శాతం అబద్ధాలేనని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రజాప్రయోజనాలు పట్టడం లేదని ఆయన విమర్శించారు.

తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కేసీఆర్ విమర్శించారు. రాష్ట్రానికి గడిచిన ఆరేళ్లలో బిజెపి ప్రభుత్వం ఏమీ చేయలేదని ఆయన అన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి ఏ విధమైన సహకారం అందించడం లేదని, ఉద్దేశ్యపూర్వకంగానే ఇదంతా చేస్తోందని ఆయన అన్నారు. 

కేంద్రానికి అవసరమైనప్పుడు పలుమార్లు సహకరించామని ఆయన చెప్పారు. జీఎస్టీ అమలు సమయంలోనూ జీఎస్టీ రద్దు విషయంలోనూ కేంద్రానికి సహకరించామని ఆయన చెప్పారు. చేసిన సహాయాన్ని కేంద్రం గుర్తు పెట్టుకోలేదని ఆయన అన్నారు. కృష్ణా, గోదావరి నదీ జలాల్లో రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన వాటాను ఖరారు చేయడం లేదని, దీనిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కేసీఆర్ అన్నారు. 

పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఉన్న వివాదాల పరిష్కారానికి చొరవ ప్రదర్శించడం లేదని ఆయన అన్నారు. ఈ స్థితిలో కేంద్రంపై పోరాటం తప్ప మరో మార్గం లేదని ఆయన అన్నారు.