దుబ్బాక దెబ్బతో నాగార్జున సాగర్ మీద కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌ శాసనసభ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వరాల జల్లు కురిపించారు. 

సాగర్ లో 6 నెలల్లోపు ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమి, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఆశించిన మేర సీట్లు రాకపోవడంతో టీఆర్‌ఎస్‌ పార్టీకి సాగర్‌ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ ఎన్నికలో గెలిచి మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లో తన సత్తా చాటాలని టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ తక్షణ చర్యలు ప్రారంభించారు. 

దీంట్లో భాగంగా నియోజకవర్గం పరిధిలోని హాలియాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ రాక ముందే రైతులందరి ఖాతాల్లో ఈ ఏడాది రెండో విడత రైతుబంధు డబ్బులను జమ చేసేందుకు సీఎం కసరత్తు చేస్తున్నారు. 

సోమవారం ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి యాసంగి సాగు కోసం రైతు బంధు పంపిణీపై నిర్ణయం తీసుకోనున్నారు. సాగర్‌ నియోజకవర్గంలో చేపట్టదలిచిన నాలుగు ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. దీంతో పాటు మరో పైప్‌లైన్‌ వ్యవస్థ ఏర్పాటు కోసం.. మొత్తంగా దాదాపు రూ.600 కోట్ల పనులకు అనుమతులు మంజూరు చేశారు. 

బోతలపాలెం–వడపల్లి ఎత్తిపోతల పథకాన్ని దామరచెర్ల మండలం వడపల్లి వద్ద నిర్మించేందుకు రూ.229.25 కోట్లతో పరిపాలన అనుమతులు ఇవ్వగా, సాగర్‌ కాల్వలపై దున్నపోతులగండి– బాల్నేపల్లి–చంపాల తండా ఎత్తిపోతల పథకాన్ని అడవిదేవునిపల్లి మండల పరిధిలోని చిట్యాల గ్రామం వద్ద నిర్మించేలా రూ.219.90 కోట్లతో అనుమతులు ఇచ్చారు. 

ఈ ఎత్తిపోతల పథకంలో భాగంగా అప్రోచ్‌ చానల్, ఫోర్‌బే, పంప్‌హౌస్, ప్రెషర్‌మెయిన్, డెలివరీ సిస్టమ్, గ్రావిటీ కెనాల్‌ల నిర్మాణ పనులు చేయనున్నారు. ఇక రాష్ట్ర ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కింద మూసీ నదిపై కేశవాపురం–కొండ్రపోల్‌ ఎత్తిపోతల పథకాన్ని దామరచర్ల మండల పరిధిలోని కేశవాపురం గ్రామం వద్ద నిర్మించేలా రూ.75.93 కోట్లతో అనుమతులు ఇచ్చారు. 

ఈ ఎత్తిపోతల ద్వారా 5,875 ఎకరాలు సాగులోకి తేనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక టీఎస్‌ఐడీసీ కిందే నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌ ఫోర్‌ షోర్‌లో నెల్లికల్‌ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టేందుకు అనుమతులిచ్చారు. రూ.72.16 కోట్లతో దీనికి అనుమతులు ఇవ్వగా, 4,175 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందివ్వాలని నిర్ణయించారు. 

వీటితో పాటే ఏఎంఆర్‌పీ హైలెవల్‌ కెనాల్‌ పరిధిలోని డి్రస్టిబ్యూటరీ 8, 9లకు లో లెవల్‌ కెనాల్‌ పంప్‌హౌస్‌ నుంచి పైప్‌లైన్‌ ద్వారా నీటి సరఫరాతో పాటు, ఈ డి్రస్టిబ్యూటరీల పరిధిలోని పొదలు, పూడిక తీసివేత కోసం 2.76 కోట్లతో అనుమతులు ఇచ్చారు. గత అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల ప్రచార సమయంలోనే ఈ ఎత్తిపోతల పథకాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇవ్వగా, ప్రస్తుతం ఏ సమయమైనా ఎన్నికల కోడ్‌ రానున్న దృష్ట్యా ముందే వీటికి అనుమతులిచ్చారు.