కాంగ్రెస్ కు ఓటేస్తే అంధకారంలో తెలంగాణ: కోదాడ సభలో డీకే శివకుమార్ కు కేసీఆర్ కౌంటర్
కాంగ్రెస్ కు ఓటు వేస్తే తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతారని సీఎం కేసీఆర్ చెప్పారు. తమ పాలనలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను కేసీఆర్ వివరించారు.
కోదాడ: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంటు ఉండదు... తెలంగాణలో కారు చీకట్లతో మునిగిపోతుందని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు.ఆదివారంనాడు కోదాడలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సంధర్బంగా ఆయన ప్రసంగించారు. తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ను అందిస్తున్న విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు.
నిన్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పరిగి ఎన్నికల సభలో చేసిన ప్రసంగాన్ని కేసీఆర్ ప్రస్తావించారు. కర్ణాటకలో వ్యవసాయానికి ఐదు గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్నట్టుగా డీకే శివకుమార్ సిగ్గు లేకుండా ప్రచారం చేస్తున్నారన్నారు. కర్ణాటకలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయలేదని ఆయన విమర్శించారు. తెలంగాణలో రైతులకు మూడు గంటల విద్యుత్ సరిపోతుందని కాంగ్రెస్ చెబుతుందన్నారు. 24 గంటల విద్యుత్ కావాలా వద్దో చెప్పాలని ఆయన ప్రజలను ప్రశ్నించారు. రైతు బంధు వద్దని టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నారన్నారు. రైతు బంధును ఎత్తివేయాలా అని ఆయన ప్రజలను కోరారు. ధరణిని ఎత్తివేస్తామని మల్లు భట్టి విక్రమార్క ప్రచారం చేస్తున్నారన్నారు. ధరణి ఎత్తివేస్తే రైతు భీమా, రైతు బంధు ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు.
గతంలో పార్టీలకు అధికారం ఇస్తే ఏం చేశారో ఆలోచించాలని కేసీఆర్ కోరారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఆలోచించి ఓటేయాలన్నారు.మన ఓటు భవిష్యత్తును నిర్ధేశిస్తుందన్నారు.
తెలంగాణ రాకముందు సాగర్ నీళ్ల కోసం రైతులు తన వద్దకు వచ్చారని కేసీఆర్ చెప్పారు. ఆనాడు ప్రభుత్వానికి 24 గంటల్లో నీటిని విడుదల చేయాలని తాను ఆనాడు వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కోదాడ నుండి హలియా వరకు పాదయాత్ర నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తాను పాదయాత్ర చేసిన సమయంలో కాలువలకు నీరు రాక ఇబ్బంది పడేవారన్నారు. ప్రాజెక్టులకు ఆపింది కాంగ్రెస్ పార్టీ దద్దమ్మలేనని కేసీఆర్ విమర్శించారు. కోదాడలో పంట పొలాలకు నీరు రావాలంటే ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఉండేదన్నారు.
నాగార్జునసాగర్ కు ఆనాడు హైద్రాబాద్ రాష్ట్రం పెట్టుకున్న పేరు నందికొండ ప్రాజెక్టు అని కేసీఆర్ గుర్తు చేశారు.ఏళేశ్వరం వద్ద కట్టాల్సిన ప్రాజెక్టును ముందుకు జరిపి కట్టారని కేసీఆర్ ఆరోపించారు. తాను మాట్లాడేంత వరకు తెలంగాణ నీటి హక్కుల గురించి ఎవరూ మాట్లాడలేదన్నారు.పంట పొలాలకు సంపూర్ణంగా అందించే బాధ్యత తనదన్నారు.తెలంగాణకు బీఆర్ఎస్ పాలనే శ్రీరామరక్ష అని ఆయన చెప్పారు.
తెలంగాణలో ప్రస్తుతం కరువు, కర్ఫ్య్యూ లేదన్నారు. ఈ ఏడాదే నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిండలేదన్నారు. అయినా కూడ ఈ దఫా సాగర్ కాలువలకు నీటిని విడుదల చేసినట్టుగా కేసీఆర్ గుర్తు చేశారు.బీసీల చైతన్యం చూపించాల్సిన బాధ్యత కోదాడ ప్రజలపై ఉందన్నారు. కోదాడలో మల్లయ్య యాదవ్ ను గెలిపిస్తే రూ. 10 కోట్లతో బీసీ భవన్ ను నిర్మిస్తామన్నారు.మల్లయ్య గెలవకుండా కుట్రలు చేస్తున్నారు. రైతు బంధు కోసం ఎవరైనా ధర్నాలు చేశారా అని ఆయన ప్రశ్నించారు. రైతు బంధును విడతల వారీగా పెంచుకుంటూ పోతామని కేసీఆర్ చెప్పారు.