హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు సులభంగా గెలుస్తుందని, జగన్‌ అధికారంలోకి వస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు అన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడే మే 23వ తేదీలోగానే మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలను పూర్తి చేసుకుందామని, ఇందుకు పార్టీ యంత్రాంగం సన్నద్ధం కావాలని కేసీఆర్‌ పార్టీ నాయకులకు సూచించారు. 

కేసీఆర్ శుక్రవారం పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ అభ్యర్థులు కలిశారు. ఈ సందర్భంగా వారితో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు.

అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల తరహాలోనే పరిషత్‌ ఎన్నికల్లోనూ గట్టిగా పనిచేయాలని, ఎక్కడా ఉదాసీనత ప్రదర్శించవద్దని కేసీఆర్ నేతలను ఆదేశించారు. ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో పార్టీ సన్నాహక సమావేశాన్ని త్వరలోనే నిర్వహిస్తామని చెప్పారు. మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలకు సంబంధించి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు అన్ని వ్యవహారాలను చూసుకుంటారని తెలిపారు.  పరిషత్‌ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యతను మంత్రులు, ఎమ్మెల్యేలు తీసుకోవాలని ఆదేశించారు.

రాష్ట్రంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 16 స్థానాలనూ గెలవబోతున్నట్లు కెసిఆర్ తెలిపారు. ముందు నుంచీ చెబుతున్నట్లుగా తాము క్లీన్‌ స్వీప్‌ చేస్తున్నామని, మొత్తం 17 స్థానాల్లో 16 చోట్ల టీఆర్‌ఎస్‌, ఒక స్థానంలో తమ మిత్రపక్షం మజ్లిస్‌ గెలుస్తుందని చెప్పారు.