Asianet News TeluguAsianet News Telugu

అసెంబ్లీ ఫార్మూలా: సిట్టింగ్‌ ఎంపీలకే కేసీఆర్ ఛాన్స్

తెలంగాణ రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో ఒక్క స్థానం మినహా మిగిలిన 16 ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ వ్యూహరచన చేస్తోంది.హైద్రాబాద్ ఎంపీ స్థానంలో ఎంఐఎం విజయం సాధించాలని టీఆర్ఎస్ కోరుతోంది.

kcr plans to win 16 mp seats in telangana
Author
Hyderabad, First Published Jan 26, 2019, 7:41 PM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో ఒక్క స్థానం మినహా మిగిలిన 16 ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ వ్యూహరచన చేస్తోంది.హైద్రాబాద్ ఎంపీ స్థానంలో ఎంఐఎం విజయం సాధించాలని టీఆర్ఎస్ కోరుతోంది.అవసరమైతే ఈ స్థానంలో నామమాత్రపు పోటీ పెట్టే అవకాశం ఉంది.

సిట్టింగ్ ఎంపీల్లో కొందరికి ఈ దఫా మొండిచేయి దక్కే అవకాశం లేకపోలేదనే ప్రచారం కూడ పార్టీలో చర్చ సాగుతోంది.దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పును తీసుకురావాలని ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. 

ఈ ప్లాన్‌లో భాగంగా కేసీఆర్ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే కేసీఆర్ నల్గొండ ఎంపీ స్థానం నుండి పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.

ప్రస్తుతం నల్గొండ ఎంపీగా గుత్తా సుఖేందర్ రెడ్డి ఉన్నారు. గత ఎన్నికల్లో సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ లో చేరారు.సుఖేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా చేసి కేబినెట్‌లోకి కేసీఆర్ తీసుకొనే అవకాశం ఉందని ప్రచారంలో ఉంది.

 నల్గొండ నుండి పోటీ చేసేందుకు కేసీఆర్ ప్లాన్ చేసుకొంటున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, జహీరాబాద్,ఆదిలాబాద్, కరీంనగర్, భువనగిరి ఎంపీ స్థానాల నుండి సిట్టింగ్ ఎంపీలకు మరోసారి టిక్కెట్లు దక్కే అవకాశం ఉంది. 

త్వరలో ఎమ్మెల్సీగా పదవీ కాలం పూర్తి చేసుకోనున్న శాసన మండలి చైర్మన్‌ కె.స్వామిగౌడ్‌ చేవెళ్ల నుంచి పోటీ చేయడం దాదాపు ఖాయమని తెలుస్తోంది. ఈ మేరకు ఆయనకు టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం నుంచి సంకేతాలు అందినట్లు సమాచారం. 

మరోవైపు మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి కూడ చేవేళ్ల నుండి ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తిని చూపుతున్నట్టు సమాచారం. ఈ స్థానం నుండి గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

మల్కాజిగిరి టికెట్‌ను టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేశ్‌ ఆశిస్తున్నారు.నాగర్‌ కర్నూలు నుంచి మాజీ మంత్రి రాములు, మాజీ ఎంపీ మంద జగన్నాథంలు పోటీ పడుతున్నారు. పెద్దపల్లి ఎంపీ స్థానం నుండి మాజీ ఎంపీ వివేక్ పేరు ప్రముఖంగా విన్పిస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో వివేక్ పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేశారనే ప్రచారం సాగింది. కొప్పుల ఈశ్వర్ లాంటి నేతలు వివేక్ పై పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేశారు.

మహబూబ్‌నగర్ ఎంపీ స్థానం నుండి ఏపీ జితేందర్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే ఈ జితేందర్ రెడ్డి తీరుపై టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులే అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి ఒకరు టీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఈ స్థానంలో అభ్యర్థిని మార్చే అవకాశం ఉందనే ప్రచారం కూడ లేకపోలేదు.

ఖమ్మం ఎంపీ స్థానం పరిధిలో టీఆర్ఎస్ అభ్యర్థి ఒక్కరే విజయం సాధించారు. ఇండిపెండెంట్ గా విజయం సాధించిన రాములునాయక్ టీఆర్ఎస్ లో చేరారు. అయితే పార్టీలోని గ్రూపు తగాదాల కారణంగానే ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ఎక్కువ స్థానాలను కోల్పోయిందని కేసీఆర్ స్వయంగా ప్రకటించారు.ఖమ్మం ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకొనేందుకు వీలుగా టీఆర్ఎస్ వ్యూహరచన చేస్తోంది.

మహబూబాబాద్ ఎంపీపై కూడ స్థానికంగా ఉన్న టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు కొంత అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు.మరోవైపు సికింద్రాబాద్ ఎంపీ స్థానంపై పోటీ చేసేందుకు పలువురు ఆసక్తిని చూపుతున్నారు. అయితే ఎంపీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ముందుగానే పోటీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios