హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో  కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్షాన్ని టీఆర్ఎస్‌లో విలీనం చేసే ప్రక్రియకు త్వరలోనే జరిగే అవకాశం ఉంది. ఎంపీగా ఎన్నికైన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి  ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగానే సీఎల్పీని టీఆర్ఎస్‌లో విలీనం చేసే అవకాశం ఉందని సమాచారం.

గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ 19 సీట్లను కైవసం చేసుకొంది. అయితే ఆ తర్వాత చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించారు.  

అసెంబ్లీలో సీఎల్పీని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేసేలా అధికార పార్టీ వ్యూహ రచన చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 11 వతేదీన జరిగిన ఎన్నికల్లో నల్గొండ ఎంపీ స్థానం నుండి  విజయం సాధించిన  టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే హుజూర్‌నగర్ నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే.

19 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో ఇప్పటికే 11 మంది టీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండు రోజుల్లోపుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. తాజాగా ఎన్నికైన ఎంపీల గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ గెజిట్ విడుదలైన 14 రోజుల్లోపుగా ఎమ్మెల్యే పదవికి ఉత్తమ్ రాజీనామా చేయాల్సి ఉంటుంది.

రెండు రోజుల క్రితమే ఉత్తమ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని భావించారు. కానీ, కొన్ని కారణాల వల్ల ఆయన రాజీనామా చేయలేదని సమాచారం. ఈ నెల 6వ తేదీన  ఉత్తమ్ తెలంగాణ అసెంబ్లీ కార్యాలయంలో రాజీనామా పత్రాన్ని అందించే అవకాశం ఉంది. 

ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే కాంగ్రెస్ పార్టీ బలం 18కు పడిపోతోంది. అయితే ఇప్పటికే 11 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించారు. వరంగల్ జిల్లాకు చెందిన మరో కాంగ్రెస్ ఎమ్మెల్యేతో కూడ టీఆర్ఎస్ నేతలు టచ్‌లోకి వెళ్లినట్టుగా ప్రచారం సాగుతోంది.

ఉత్తమ్ రాజీనామా చేయగానే మరో ఎమ్మెల్యేను కూడ తమ వైపుకు తిప్పుకొని సీఎల్పీని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేసేందుకు అధికార పార్టీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.

గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధులుగా విజయం సాధించిన చిరుమర్తి లింగయ్య, ఆత్రం సక్కు, రేగా కాంతారావు, గండ్ర వెంకటరమణరెడ్డి, కందాల ఉపేందర్ రెడ్డి, హరిప్రియా నాయక్, వనమా వెంకటేశ్వరరావు, సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి, జాజుల సురేందర్ , హర్షవర్ధన్ రెడ్డిలు టీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించారు.

ఇప్పటికే శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్షాన్ని టీఆర్ఎస్‌లో విలీనం చేశారు. ఇదే ప్రక్రియను అసెంబ్లీలో కూడ అమలు చేయనున్నారు. 2014 ఎన్నికల తర్వాత శాసనసమండలి, అసెంబ్లీలో కూడ టీడీపీ శాసససభక్షాలను టీఆర్ఎష్‌లో విలీనం చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే సీఎల్పీని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేయడంపై  కాంగ్రెస్ పార్టీ నేతలు లోక్‌పాల్‌ను ఆశ్రయించారు.