టీఆర్ఎస్ ఇక నుండి బీఆర్ఎస్: తెలంగాణ భవన్‌లో వేడుకలు, పార్టీ నేతలతో కేసీఆర్ భేటీ
తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్టీ పతాకాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు.
హైదరాబాద్: తెలంగాణ భవన్ లో శుక్రవారం నాడు మధ్యాహ్నం బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు.టీఆర్ఎస్ ఇక నుండి బీఆర్ఎస్ గా మారింది. ఈ మేరకు ఈసీ పంపిన పత్రాలపై కేసీఆర్ సంతకం చేశారు.ఈ పత్రాలను ఈసీకి పంపనున్నారు. అప్పా జంక్షన్ నుండి సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. తొలుత తెలంగాణ భవన్ లో తెలంగాణ తల్లి విగ్రహనికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో కేసీఆర్ సహా పార్టీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామిలు తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. కేసీఆర్ తో పాటు ప్రకాష్ రాజ్, కుమారస్వామిలు కూడా ఈ పూజల్లో పాల్గొన్నారు.
టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ ఈ ఏడాది అక్టోబర్ 5న తీర్మానం చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. ఈ తీర్మానాన్ని పరిశీలించిన ఈసీ టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ కేసీఆర్ కు ఈ నెల 8వ తేదీన సమాచారం పంపింది.ఈసీ పంపిన లేఖపై కేసీఆర్ సంతకం చేశారు. ఈ లేఖను కేసీఆర్ ఈసీకి పంపనున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు బీఆర్ఎస్ పతాకాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు.
పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన తర్వాత పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి టీఆర్ఎస్ శ్రేణులు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.ఇక నుండి టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారనుంది. బీఆర్ఎస్ పేరుతోనే ఆ పార్టీ కార్యక్రమాలు సాగుతాయి. ఇక నుండి టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారనుంది. బీఆర్ఎస్ పేరుతోనే ఆ పార్టీ కార్యక్రమాలు సాగుతాయి. గులాబీ రంగు జెండాలో భారతదేశం మ్యాప్ ను పార్టీ జెండాలో ఉంచారు. బీఆర్ఎస్ కండువాను కుమారస్వామికి వేశారు కేసీఆర్.
టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా ఆవిర్భావం చెందడంతో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, ప్రకాష్ రాజ్ లు కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. అక్టోబర్ ఐదో తేదీన టీఆర్ఎస్ పేరును మారుస్తూ చేసిన తీర్మానం సమయంలో కూడా కుమారస్వామి పాల్గొన్న విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా పార్టీని విస్తరించాలని కేసీఆర్ భావిస్తున్నారు టీఆర్ఎస్ గా పేరుంటే దేశంలోని ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణకు ఇబ్బంది ఉంటుందని భావించారు. ఈ కారణంతో టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చారు. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని కేసీఆర్ భావిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలను, నేతలను కూడగట్టే పనిలో కేసీఆర్ ఉన్నారు.అనంతరం పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. రానున్న రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ పార్టీ నేతలకు దిశా నిర్ధేశం చేయనున్నారు.