తెలంగాణ సిఎం కేసిఆర్ తీసుకున్న అనూహ్యమైన నిర్ణయం తెలంగాణలో తీవ్ర చర్చను లేవనెత్తింది. జాతీయ రాజకీయాలను శాసించే దిశగా కేసిఆర్ అడుగులు వేస్తున్నారని టిఆర్ఎస్ నేతలు సంబరాల్లో మునగిపోతున్నారు. అసాధ్యం అనుకున్న తెలంగాణను తన చతురతతో సుసాధ్యం చేసిన వ్యక్తికి ఢిల్లీ పీఠంపై జెండా ఎగురవేయడం పెద్ద కష్టమేమీ కాదని గులాబీ శ్రేణులు చెబుతున్నమాట.

ఇక ఢిల్లీ జైత్రయాత్ర విషయంలో కేసిఆర్ మాటలకే పరిమితం కాలేదు. గత రెండు రోజుల్లోనే జాతీయ స్థాయిలో ఒక చర్చను లేవనెత్తడంలో విజయం సాధించారని టిఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు.. ఇప్పుడు ఇక వరుసగా సభలు, సమావేశాలతో వేడి పెంచేందుకు కేసిఆర్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

విశ్రాంత ఉద్యోగులు, అధికారుల సేవలు వినియోగించుకుని జాతీయ స్థాయిలో మరింత చర్చను లేవనెత్తేందుకు కేసిఆర్ కసరత్తు షురూ చేశారు. రిటైర్డ్ సివిల్ సర్వీసెస్ అధికారులతో పాటు మాజీ  సైనికోద్యోగులను త్వరలోనే కలవాలనుకుంటున్నారు. దేశ సౌభాగ్యానికి కావాల్సిన ఎజెండాను రూపొందించేందుకు రిటైర్డ్ అధికారులతో త్వరలోనే భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే న్యాయ నిపుణులు, సీనియర్ జాతీయ జర్నలిస్టులు,  అఖిల భారత రైతు సంఘాలు, కార్మిక సంఘాలతో భేటీ కానున్నారు.

దేశంలోని మెట్రో సిటీస్ తో పాటు పలు నగరాల్లో ఈ కమిటీలు సమావేశాలు నిర్వహించి.. ప్రత్యామ్నాయాలు, 70 ఏళ్లలో దేశాభివృద్ధి, కాంగ్రెస్ – బీజేపీ విధానాలు, రావాల్సిన మార్పులను వివరించనున్నారు. దీనికి సంబంధించి కార్యచరణ త్వరలోనే ప్రారంభించనున్నారు.

మాజీ ఐఎఎస్, ఐపిఎస్, ఎఎఫ్ఎస్, ఐఆర్ఎస్ అధికారులు, న్యాయ నిపుణులు, మేధావులతో ఏర్పాటు అయ్యే ఈ కమిటీలు హైదరాబాద్ తోపాటు ఢిల్లీ, కోల్ కతా, ముంబై, చెన్నై, బెంగళూరు నగరాల్లో సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఆయా వర్గాలను సంప్రదించడానికి, సమన్వయం చేయడానికి ప్రత్యేకంగా సమన్వయకర్తలను కూడా నియమించనున్నారు కేసిఆర్.

మొత్తానికి తెలంగాణ నుంచి జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసిన వారిలో ఆధ్యుడు పివి నరసింహారావు కాగా.. తాజాగా కేసిఆరే ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. మరి ఆయన ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతమవుతాయన్నది ఆచరణలో తెలిసే చాన్స్ ఉంది.