Asianet News TeluguAsianet News Telugu

కెసిఆర్ చాన్స్ మిస్: అవకాశాన్ని కొట్టేసిన చంద్రబాబు

కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గైర్హాజరు కావడం ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మంచి అవకాశాన్ని కోల్పోయారనే మాట వినిపిస్తోంది.

KCR misses a chance to push forth National Front

హైదరాబాద్: కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గైర్హాజరు కావడం ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మంచి అవకాశాన్ని కోల్పోయారనే మాట వినిపిస్తోంది. తాను తలపెట్టిన ఫెడరల్ ఫ్రంట్ ను ముందుకు తీసుకుని వెళ్లడానికి వచ్చిన అవకాశాన్ని ఆయన జారవిడుచుకున్నారనే మాట వినిపిస్తోంది.

కాగా, కేసిఆర్ లేకపోవడంతో ఆ అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొట్టేశారని అంటున్నారు. కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రాంతీయ పార్టీలకు చెందిన పలువురు నేతలు వచ్చారు. కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లి ఉంటే తన కూటమిని ముందుకు తీసుకుని వెళ్లడానికి కేసిఆర్ కు అవకాశం దక్కి ఉండేదని అంటున్నారు. 

కేసిఆర్ ఒక్క రోజు ముందే మంగళవారంనాడు బెంగళూరు వెళ్లి కుమారస్వామిని అభినందించి వచ్చారు. ప్రమాణ స్వీకారానికి వెళ్లలేదు. అయితే, కాంగ్రెసు నేత చిన్నారెడ్డి ఈ విషయంపై కేసిఆర్ మీద విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని నేరుగా చూసే ధైర్యం లేకపోకనే కేసీఆర్ ఆ కార్యక్రమానికి వెళ్లలేదని అన్నారు. 

ఏమైనా, కేసీఆర్ లేకపోవడంతో చంద్రబాబు ప్రాంతీయ పార్టీల నాయకుల దృష్టిని ఆకర్షించారు. మూడో కూటమికి నాయకత్వం వహించాలని తృణమూల్ కాంగ్రెసు నేత మమతా బెనర్జీ చంద్రబాబును కోరారు. వారిద్దరి మధ్య కేంద్రం రాష్ట్రాలకు ఇస్తున్న నిధుల్లో పెట్టిన కోతపై చర్చ జరిగింది. కోఆపరేటివ్ ఫెడరలిజంపై వారిద్దరి మధ్య చర్చ సాగింది.

కాంగ్రెసు వ్యతిరేక వైఖరి అవలంబిస్తున్నప్పటికీ చంద్రబాబు నాయుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో వేదికను పంచుకోవడానికి వెనకాడలేదు. రాహుల్ గాంధీతో ఆయన కరచాలనం చేశారు. 

దేశ ప్రయోజనాల కోసం భవిష్యత్తులో జెడిఎస్ తో కలిసి పనిచేస్తామని చంద్రబాబు చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ పై కేసిఆర్ గతంలో అఖిలేష్ యాదవ్ తోనూ మమతా బెనర్జీతోనూ చర్చించారు. వారిద్దరు కూడా చంద్రబాబుతో చాలా సన్నిహితంగా మాట్లాడారు. ప్రాంతీయ పార్టీల కూటమికి నాయకత్వం వహించాలని మమతా బెనర్జీ స్వయంగా చంద్రబాబును అడిగారు. 

కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన నేతలంతా బిజెపి వ్యతిరేక పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు కావడం విశేషం. మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ లతో పాటు మాయావతి (బిఎస్పీ), తేజస్వి యాదవ్ (ఆర్జెడి), అరవింద్ కేజ్రీవాల్ (ఆప్) తదితరులు ఉన్నారు. ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మాత్రం దూరంగా ఉన్నారు. తూత్తుకుడి సంఘటన నేపథ్యంలో డిఎంకె నేత స్టాలిన్ హాజరు కాలేదు.  

Follow Us:
Download App:
  • android
  • ios