చెన్నై: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తలపెట్టిన ఫెడరల్ ఫ్రంట్ పట్ల తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సినీ నటులు కమల్ హాసన్, రజనీకాంత్ ఆసక్తి చూపినట్లు కనిపించడం లేదు. తన రెండు రోజుల చెన్నై పర్యటనలో కేసిఆర్ సోమవారంనాడు కూడా సందడి చేశారు. 

డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ తో భేటీ తర్వాత ఇతర రాజకీయ పార్టీల నేతలను కలుసుకోవాలని కేసీఆర్ అనుకున్నారు. కమల్ హాసన్, రజనీకాంత్ కూడా కేసిఆర్ ను కలుస్తారనే పుకార్లు పుట్టాయి. అయితే వారితో భేటీలు ఏమీ జరగలేదు. 

మంగళవారం సాయంత్రం కేసిఆర్ చెన్నై నుంచి హైదరాబాదు బయలుదేరి వెళ్లారు. కొంత మంది రిటైర్డ్ ఐఎఎస్ అధికారులతో ఆయన సమావేశమవుతారని భావించారు. కానీ అది కూడా జరగలేదు. 

తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి ప్రదర్శిస్తున్న కొంత మంది ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఆయనను కలిశారు. శ్రీ సిటీ చైర్మన్ రవి చెన్నారెడ్డి, అరవింద్ ఫార్మాకు చెందిన వరప్రసాద్ రెడ్డి హోటల్లో కేసీఆర్ ను కలిశారు. హైదరాబాదుకు చెందిన రాంకీ గ్రూప్ ప్రతినిధుల బృందం ఆయనను కలిసింది. పలువురు శ్రేయోభిలాషులు కలిసి కేసిఆర్ ను అభినందించారు. 

మంగళవారంనాడు ఆయనను డిఎంకె నేత కనిమొళి కలిసిన విషయం తెలిసిందే. కేసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ యత్నాలను ఆమె ప్రశంసించారు. దేశాభివృద్ధికి, రాష్ట్రాల అభివృద్ధికి మరింత ఐక్యంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. 

కాళేశ్వరం నీటి పారుదల ప్రాజెక్టును, మిషన్ భగీరథను అధ్యయనం చేయడానికి త్వరలోనే తెలంగాణకు వస్తానని ఆమె కేసిఆర్ తో చెప్పారు. మెలాపోర్ లోని కపిలేశ్వరం ఆలయాన్ని కేసిఆర్ ఆదివారం సాయంత్రం సందర్శించారు.