హైదరాబాద్:వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రెవెన్యూ ఉన్నతాధికారులు పాల్గొనాలని  సీఎం ఆదేశించారు. 

also read:రిజిస్ట్రేషన్లపై హైకోర్టు ఆదేశాలు: సుప్రీంకోర్టుకు వెళ్లనున్న తెలంగాణ సర్కార్

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి హైకోర్టు ఆదేశాల కాపీ ఇంకా ప్రభుత్వానికి అందలేదు.  హైకోర్టు కాపీ అందిన తర్వాత దానిపై కూలంకషంగా చర్చించి తగు నిర్ణయం తీసుకునేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. 

హైకోర్టు నిర్ణయంపై సుప్రీం కోర్టు కు వెళ్లడమా ? లేదంటే తగు విధమైన విధివిధానాలు రూపొందించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను చేపట్టడమా ? అనే అంశంపై రెవెన్యూ, న్యాయ శాఖల నిపుణులతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.

వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టెక్నికల్ సమస్యలు ఎదురు కావడంతో  ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ ఇటీవలనే ఈ సమస్యలపై చర్చించింది. ఈ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని సబ్ కమిటీ ప్రకటించింది.