హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అభ్యర్థులు చాలా మందిపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ప్రజల్లో కొంత మందిపై వ్యతిరేకత ఉందని తెలిసినా టీఆర్ఎస్ వారినే తిరిగి బరిలోకి దింపారు. అయినా వారు విజయం సాధించారు. స్థానికంగా కొంత మంది అభ్యర్థులను ప్రజలు తమ గ్రామాల్లోకి కూడా రానీయలేదు. 

రసమయి బాలకిషన్ వంటి కొంత మంది ప్రజల నుంచి స్థానికంగా వ్యతిరేకతను ఎదుర్కున్నారు. అయినప్పటికీ విజయం సాధించారు. 20 నుంచి 30 మందిపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని భావించారు. వారిని మారిస్తే టీఆర్ఎస్ అలవోకగా విజయం సాధించి ఉండేదని ఫలితాలకు ముందు అంచనాలు సాగాయి.

అయితే, కేసిఆర్ తన ఇమేజ్ తోనూ, సంక్షేమ పథకాలతోనూ ప్రజల మనసులను గెలుచుకున్నారని, కేసీఆర్ ను చూసి ప్రజలు ఓటేశారు తప్ప అభ్యర్థులను చూసి కాదని ఫలితాలు రుజువు చేశాయి. నిజానికి ఎన్నికలు చంద్రబాబు వర్సెస్ కేసిఆర్ గా సాగాయి. దీంతో తెలంగాణ సెంటిమెంట్  కూడా పనిచేసింది. 

చంద్రబాబును లక్ష్యం చేసుకుని కేసిఆర్, ఇతర టీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలు ప్రజల్లోకి వెళ్లాయి. ప్రజా కూటమిని గెలిపిస్తే తిరిగి తెలంగాణ చంద్రబాబు చేతుల్లోకి వెళ్తుందనే భయం ప్రజలకు పట్టుకున్నట్లు కనిపిస్తోంది. 

పోలింగ్ శాతం పెరగడం టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేస్తుందని భావించారు. కానీ, చంద్రబాబు చేతుల్లోకి తెలంగాణ వెళ్లకుండా చూసుకోవాలనే తాపత్రయం ప్రజల్లో కనిపించిందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. 

గతంలో ఇందిరా గాంధీ, ఎన్టీఆర్ ల మాదిరిగా కేసీఆర్ తన ఇమేజ్ తోనే కనీవినీ ఎరుగని రీతిలో టీఆర్ఎస్ జెండాను తెలంగాణ ఎగురేశారు. ఇంత భారీ మెజారిటీ రావడానికి కేసీఆర్ కు ప్రజల్లో ఉన్న అభిమానం తప్ప మరోటి కాదని తేలిపోయిందని అంటున్నారు. 

సంబంధిత వార్తలు

చంద్రబాబు వర్సెస్ కేసీఆర్: తెలంగాణ సెంటిమెంట్ పండింది

ఆంధ్ర సెటిలర్లపై చంద్రబాబు ఆశలు గల్లంతు

తెలంగాణ ఎన్నికలు.. విజయశాంతి చెప్పిందే నిజమైంది

టీ ఫలితాలు: ఏపిలో చంద్రబాబుకు గడ్డు కాలం, జగన్ కు జోష్

తెలంగాణ ఎన్నికలు: చంద్రబాబు 'త్యాగాల'కు కాంగ్రెస్ 'ఫలితం'