హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన త్యాగానికి కాంగ్రెసు ఫలితం అనుభవించినట్లు కనిపిస్తోంది. చంద్రబాబును తెలంగాణ ప్రజలు ఆమోదించడం లేదనే విషయం పక్కాగా ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. ఆంధ్ర సెటిలర్ల ఓట్లను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబుతో చేతులు కలిపిన కాంగ్రెసుకు చుక్కలు కనిపించాయి. 

నిజానికి, పోలింగ్ కు ముందు సర్వత్వా వినిపించిన మాట ఒక్కటి ఉంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఉంటే కాంగ్రెసు పరిస్థితి మెరుగ్గా ఉండేదని, టీఆర్ఎస్ పై గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయనే మాట తెలంగాణవ్యాప్తంగా వినిపించింది. 

కానీ, చంద్రబాబును తెలంగాణ ప్రజలు ఆమోదించకపోవడమే కాకుండా ఆయనతో దోస్తీ కట్టినందుకు కాంగ్రెసుకు కూడా గుణపాఠం చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ తెలంగాణ ప్రజల మనస్సుల్లోంచి తొలిగిపోలేదని చెప్పడానికి ఈ ఎన్నికల ఫలితాలు తార్కాణంగా నిలుస్తాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

టీఆర్ఎస్ ను ఓడించాలనే ఏకైక లక్ష్యంతో చంద్రబాబుతో కాంగ్రెసు కూటమి కట్టడం తెలంగాణ ప్రజలకు నచ్చలేదని చెప్పవచ్చు. చంద్రబాబు తిరిగి తెలంగాణపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయం ప్రజా కూటమిని తీవ్రంగా దెబ్బ తీసింది. తెలంగాణ విషయంలో అమరావతిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందనే కేసీఆర్, కేటీఆర్, ఇతర టీఆర్ఎస్ నేతల మాటలు ప్రజల్లోకి సూటిగా చొచ్చుకుని పోయినట్లు భావించవచ్చు. 

గత నాలుగున్నరేళ్లుగా తెలంగాణలో జరుగుతున్న అభిృద్ధి పనులకు చంద్రబాబు అడ్డుపడుతారనే టీఆర్ఎస్ ప్రచారం పనిచేసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు ఎలా అడ్డుపడడానికి ప్రయత్నించారనే విషయాన్ని పాయింట్లవారీగా హరీష్ రావు రెండు మూడు మీడియా సమావేశాల్లో వివరంగా చెప్పారు. 

తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడుతూ చంద్రబాబు కేంద్రానికి లేఖలు రాసిన విషయాన్ని ఆయన పదే పదే గుర్తు చేస్తూ వచ్చారు. నీళ్లు, నిధులు, నియమకాల కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నీళ్లకు చంద్రబాబు అడ్డుపడుతారనే భయం తెలంగాణ ప్రజల్లో నాటుకుపోయిందని చెప్పాలి. 

కాంగ్రెసు అధిక స్థానాలు సంపాదించి, దాని నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన ఆధిపత్యం లేదా పెత్తనం చంద్రబాబుదే ఉంటుందనే టీఆర్ఎస్ ప్రచారాన్ని ప్రజలు నమ్మినట్లు భావించవచ్చు. కాంగ్రెసు రాష్ట్ర నేతలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో పోషించిన పాత్ర కూడా ఈ ఎన్నికల్లో పనిచేసినట్లు భావించవచ్చు. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కాంగ్రెసు తెలంగాణ నేతలు ఆంధ్ర కాంగ్రెసు నేతల సూచల మేరకు పనిచేశారే తప్ప, కాకుంటే అనివార్యమైన స్థితిలోనే తెలంగాణ నినాదాన్ని ఎత్తుకున్నారు తప్ప నిజాయితీగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పనిచేయలేదనే అభిప్రాయం బలంగా ఉంది.