Asianet News TeluguAsianet News Telugu

టీ ఫలితాలు: ఏపిలో చంద్రబాబుకు గడ్డు కాలం, జగన్ కు జోష్

మరి నా పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా? అన్న తరచూ వింటూ ఉంటాం. ఈ సామెత ఇప్పుడు చంద్రబాబుకు కరెక్టుగా సెట్ అవుతుంది. రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా ఉన్నారు. ఇటు తెలంగాణ సీఎంగా కేసీఆర్ ఉన్నారు. 

Chandrabbau may face trouble in Andhra Pradesh
Author
Hyderabad, First Published Dec 11, 2018, 11:14 AM IST


హైదరాబాద్: మరి నా పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా? అన్న తరచూ వింటూ ఉంటాం. ఈ సామెత ఇప్పుడు చంద్రబాబుకు కరెక్టుగా సెట్ అవుతుంది. రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా ఉన్నారు. ఇటు తెలంగాణ సీఎంగా కేసీఆర్ ఉన్నారు. 

తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసి తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ప్రజాకూటమి అంటూ వేలుపెట్టారు. కాంగ్రెస్, టీజేఎస్,సీపీఐలతో పొత్తుపెట్టుకుని తెలంగాణ గడ్డపై అడుగుపెట్టారు. 

గ్రేటర్ హైదరాబాద్ రోడ్ షోలతోపాటు ఖమ్మం, నల్గొండ జిల్లాలోని భారీ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. రోడ్ షోలలో కేసీఆర్ పైనా ఆయన తనయుడు కేటీఆర్ పైనా నిప్పులు చెరిగారు. ధనిక రాష్ట్రంగా తెలంగాణను కేసీఆర్ కు అప్పగిస్తే అప్పుల రాష్ట్రంగా మార్చేశారంటూ ఆరోపించారు. 

సైబరాబాద్ ను తానే నిర్మించానని, హైదరాబాద్ ను ప్రపంచ చిత్రపటంలో పెట్టింది తానేని చెప్పుకొచ్చారు. తెలంగాణ నిర్మాణంలో అసలు కేసీఆర్ పాత్రే లేదంటూ కొట్టిపారేశారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. ఎక్కడికక్కడ చంద్రబాబు ఆరోపణలను టీఆర్ఎస్ తిప్పికొడుతూనే ఉంది. ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవితలు ఎండగడుతూనే వచ్చారు.  
 
చంద్రబాబు నాయుడు చర్యలతో చిర్రెత్తుకొచ్చిన చిన్న గులాబీ బాస్ తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు వేలు పెట్టారు కాబట్టి తాము ఏపీ రాజకీయాల్లో వేలుపెడతామంటూ ప్రకటించారు కేటీఆర్.  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గులాబీ పార్టీ వేలు పెట్టక తప్పదని ఆ పరిస్థితిని చంద్రబాబే స్వయంగా సృష్టించారని కెటిఆర్ హాట్ కామెంట్స్ చేశారు.

కేటీఆర్ వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం సృష్టించాయి. సరికొత్త అంచనాలు కూడా తెరపైకి వచ్చాయి. రాష్ట్ర విభజన అనంతరం కేటీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం ఇదే తొలిసారి. అంతేకాదు ఓటుకు నోటు కేసు విషయాన్ని కూడా పదేపదే ప్రస్తావించారు. 

అమరావతి నిర్మాణానికి కేసీఆర్ రూ.100కోట్లు ఇద్దామని ఆలోచనలో ఉన్నారని దాన్ని చంద్రబాబు నాయుడు చేజేతులా చెడగొట్టారంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు షెటిలర్స్ ఎవరూ చంద్రబాబు మాయమాటల్లో పడొద్దంటూ కోరారు కూడా. 

మెుత్తానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. టీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. అయితే ఆంధ్రా రాజకీయాల్లో తాము వేలుపెడతామంటూ కేసీఆర్, కేటీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు టీడీపీలో గుబులు రేపుతోంది. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడును ఎలా ఢీకొంటారు..ఏవిధంగా ఏపీ రాజకీయాల్లో అడుగుపెడతారంటూ దేశమంతా ఆసక్తిగా గమనిస్తోంది.

ఇప్పటికే చంద్రబాబు జుట్టు తమ చేతుల్లోనే ఉందంటూ టీఆర్ఎస్ చెప్తోంది. ఓటుకు నోటు వ్యవహారానికి సంబంధించి కీలక ఆధారాలు ఉన్నాయంటూ ప్రకటిస్తోంది. ఈ నేపథ్యంలో తండ్రీ, తనయులు మళ్లీ ఓటుకు నోటు కేసును అస్త్రంగా తీసుకుని చంద్రబాబును ఓ ఆట ఆడుకుంటారంటూ ప్రచారం జరుగుతుంది.  

తాము తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసి ఎంతో ఉత్సాహాంతో ముందస్తుకు వెళ్తే ప్రజాకూటమి పేరుతో చంద్రబాబు నాయుడు తమను డిపెన్స్ లో పడేలా చేశారని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో అందుకు కారణమైన చంద్రబాబుకు రాజకీయంగా గట్టి దెబ్బ ఇవ్వాలని భావిస్తోంది. టీఆర్ఎస్ కొట్టే దెబ్బ నషాళానికి అంటేలా చుక్కలు చూపించాలని వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది.  
 
ఇకపోతే తెలంగాణలో వైఎస్ఆర్సీపీ, కానీ జనసేన కానీ పోటీ చెయ్యలేదు ఏ పార్టీకి మద్దతు ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో చంద్రబాబు ప్రయోగించిన ప్రజాకూటమి అస్త్రాన్నే అక్కడ ప్రయోగించాలని భావిస్తున్నారట. 

వైసిపి, జనసేన పార్టీలలో ఏదో ఒక పార్టీకి మద్దతు ప్రకటించడమా లేక తెలంగాణ రాష్ట్రం తరహాలో ప్రజాకూటమిని ఏర్పాటు చెయ్యడమా అన్న కోణంలో ఆలోచించే అవకాశం లేకపోలేదు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాకూటమికి టీఆర్ఎస్ కీలక భూమిక పోషించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ప్రజాకూటమితో ఏపీలో చంద్రబాబును రాజకీయ సమాధి చేసేందుకు వ్యూహా రచన చేసే అవకాశం ఉంది. 

ఇప్పటికే ఈ ఎన్నికల్లో గెలిస్తే రాష్ట్ర రాజకీయాలతోపాటు దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తానన్న కేసీఆర్ తొలుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వేలుపెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఉభయ కమ్యూనిష్టులను ఒకే తాటి పైకి తీసుకువచ్చేందుకు నేరుగా కేసీఆర్ రంగంలోకి దిగబోతున్నారంటూ ప్రచారం జరుగతుంది. జాతీయ స్థాయిలో బీజేపీయేతర, కాంగ్రెసేతర కూటమికి కేసీఆర్ పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో అదే వంకతో ఏపీలో ఎంటర్ అవుతారని తెలుస్తోంది.    

 మెుత్తానికి చంద్రబాబు నాయుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వేలు పెట్టినందుకు గానూ చుక్కలు చూపించేందుకు గులాబీ దళం రెడీ అవుతుంది. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆగర్భ శత్రువులను ఏకం చేసి చంద్రబాబును శంకరగిరి మాన్యాలు పట్టించేందుకు వ్యూహరచన చేస్తోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios