నేడు ఢిల్లీకి కేసీఆర్.. ఎల్లుండి బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం.. అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్న గులాబీ బాస్..
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. జాతీయ రాజకీయాల్లోకి పార్టీ అడుగుపెట్టినందుకు గుర్తుగా భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)ని లాంఛనంగా ప్రారంభించిన మూడు రోజుల తర్వాత కేసీఆర్ ఈ పర్యటన చేపడుతున్నారు.

బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. జాతీయ రాజకీయాల్లోకి పార్టీ అడుగుపెట్టినందుకు గుర్తుగా భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)ని లాంఛనంగా ప్రారంభించిన మూడు రోజుల తర్వాత కేసీఆర్ ఈ పర్యటన చేపడుతున్నారు. అయితే ఢిల్లీ పర్యటనలో భాగంగా అక్కడ బీఆర్ఎస్ తాత్కాలిక కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ క్రమంలోనే ఆయన తన సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారు. సాధారణంగా కేసీఆర్‌కు దైవభక్తి, సెంటిమెంట్ ఎక్కువనే చెప్పాలి. ఏ కార్యక్రమం ప్రారంభించాలని భావించిన కేసీఆర్ ముందుగా.. మంచి ముహుర్తం ఉండేలా చూసుకుంటారు. మరోవైపు పలు సందర్భాల్లో ఆలయాల సందర్శనలు, యాగాలు కూడా చేస్తూ ఉంటారు.
ఇదే తరహాలో ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం సందర్భంగా డిసెంబర్ 13, 14 తేదీల్లో కేసీఆర్ రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు. గతంలో పలు సందర్భాల్లో కేసీఆర్ యాగాలు నిర్వహించారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని వారాల ముందు కూడా కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లో రాజశ్యామల యాగం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో విజయం సాధించి రెండో సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. 2019 జనవరిలో ఐదు రోజుల పాటు సహస్ర మహా చండీ యాగం నిర్వహించారు.
ఇప్పుడు బీఆర్ఎస్‌తో రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న కేసీఆర్ మరోసారి తన సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ ఢిల్లీలోని సర్దార్ పటేల్ రోడ్‌లో పార్టీ తాత్కాలిక కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. యాగం ఏర్పాట్లకు సంబంధించిన బాధ్యతలను ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి అప్పగించారు. ఇదిలా ఉంటే.. 2021 సెప్టెంబర్‌లో న్యూఢిల్లీలోని వసంత్ విహార్‌లో పార్టీ శాశ్వత కార్యాలయానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఆ భవన నిర్మాణం వచ్చే ఏడాది జూన్ నాటికి భవనం పూర్తవుతుందని భావిస్తున్నారు.
ఇక, తన పర్యటనలో వారం రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్న కేసీఆర్.. వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు, దళితులు, ఓబీసీ సంఘాల నాయకులతో సమావేశమై బీఆర్‌ఎస్‌కు మద్దతుపై చర్చించనున్నట్టుగా సమాచారం. సోమవారం రాత్రి ఢిల్లీలో రిటైర్డ్ ఆల్ ఇండియా సర్వీసు అధికారులు, సీనియర్ జర్నలిస్టులతో కేసీఆర్ సమావేశం కానున్నట్టుగా తెలుస్తోంది. 13, 14 తేదీల్లో రాజశ్యామల యాగం నిర్వహించి.. 14వ తేదీన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అదే రోజు పార్టీ కార్యవర్గం, భవిష్యత్ కార్యచరణపై కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. 15వ తేదీన వసంత్ విహార్‌లో నిర్మాణంలో ఉన్న పార్టీ శాశ్వత కార్యాలయానికి సంబంధించిన పనులను కేసీఆర్ పరిశీలించనున్నారు.