పోడు భూముల పంపిణీపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. పోడు భూములను సాగు చేసుకునే గిరిజనులకు వాటిని ఇచ్చేందుకు తమకు అభ్యంతరం లేదన్నారు.

పోడు భూముల పంపిణీపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. శుక్రవారం రోజున కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. పోడు భూములపై తమకు స్పష్టత ఉందన్నారు. సాగు చేసుకునేందుకు భూములను గిరిజనులకు ఇస్తామని చెప్పారు. పోడు భూముల వివాదానికి ముగింపు పలకాలా? వద్దా? అని ప్రశ్నించారు. మన కళ్లముందే అడవులు నాశనమైపోతున్నాయని అన్నారు. రాష్ట్రంలో అటవీ సంపదను పరిరక్షించాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాష్ట్రంలో 66 లక్షల ఎకరాల అటవీ భూములు ఉన్నాయని చెప్పారు. భవిష్యత్తులో అటవీ దురాక్రమణ జరగకూడదన్నదే తమ ధ్యేయం అని స్పష్టం చేశారు. పోడు, అటవీభూములు అంశం కొన్ని పార్టీలకు ఆట వస్తువు అయిపోయిందని విమర్శించారు. గతంలో ఇష్టానుసారం పట్టాలిచ్చి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. 

పోడు భూములను సాగు చేసుకునే గిరిజనులకు వాటిని ఇచ్చేందుకు తమకు అభ్యంతరం లేదన్నారు. సర్వే కూడా పూర్తి చేసి అంతా సిద్దం చేశామని చెప్పారు. 11.50 లక్షల ఎకరాల పోడు భూమి పంపిణీకి సిద్దంగా ఉందని తెలిపారు. పోడు భూములను ఫిబ్రవరి నెలాఖరులోపు పంపిణీ చేయనున్నట్టుగా చెప్పారు. అందరం కలిసే పోడు భూములను పంపిణీ చేద్దామని చెప్పారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వడమే కాకుండా.. రైతు బంధు, కరెంట్, నీటి సదుపాయం కల్పిస్తామని చెప్పారు. 

అయితే పోడు భూములను పొందే గిరిజన బిడ్డలు.. అడవులను కాపాడతామని రాతపూర్వక హామీ ఇవ్వాలని చెప్పారు. పోడు భూములను పొందినవారు అడవిని కాపాడాల్సిన బాధ్యత తీసుకోవాల్సిందేనని అన్నారు. పోడు భూములు పొందినవారు అడవిలో దురాక్రమణలకు పాల్పడితే పట్టాలు రద్దు చేస్తామని చెప్పారు. అటవీ భూములను అక్రమించడాన్ని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం అంగీకరించదని స్పష్టం చేశారు. అడవుల పరిరక్షణతో పాటు, ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. భూములు లేని గిరిజనులకు గిరిజన బంధు ఇవ్వడం ప్రారంభిస్తామని తెలిపారు. అలాగే గిరిజనులపై ఫారెస్ట్ అధికారులు, పోలీసులు దాడులు చేయవద్దని అన్నారు. అధికారులపై కూడా గిరిజనుల దాడి సరికాదని చెప్పారు.