KTR: రైతు బంధు కొనసాగాలంటే కేసీఆర్ మళ్లీ ఎన్నికవ్వాలి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
Telangana Elections 2023: 24 గంటల కరెంట్ కావాలంటే సీఎంగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఉండాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) అన్నారు. ఇప్పటికే 11 సార్లు గెలిచినా.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ఏం చేసిందని ప్రశ్నించారు.
Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ముందుకు సాగుతోంది. అధికార పార్టీ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కు గట్టి సవాలు విసురుతోంది. అయితే, బీఆర్ఎస్, బీజేపీలపై విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడుతున్న కాంగ్రెస్ పై గులాబీ పార్టీ నాయకులు ఎదురుదాడికి దిగారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ అధికారంలో ఉండి ఏమీ చేయలేక పోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) విమర్శలు గుప్పించారు. రైతు బంధు కొనసాగింపునకు ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) ను మళ్లీ ఎన్నుకోవడమే మార్గమని ఆయన అన్నారు.
సోమవారం యాదగిరిగుట్ట, భువనగిరి, మిర్యాలగూడ మీదుగా నిర్వహించిన ఎన్నికల రోడ్‌షోలో కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీల పై విమర్శలతో విరుచుకుపడ్డారు. తెలంగాణలో రైతు బంధు కొనసాగింపునకు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మధ్య ఉన్న సంబంధాన్ని ఆయన వివరించారు, రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ ఎన్నో పథకాలు తీసుకువచ్చారనీ, రైతుబంధు పథకాన్ని తీసుకురాగలిగిన ఏకైక నాయకుడనీ, రైతు బంధు పథకం కొనసాగాలంటే మళ్లీ సీఎం కేసీఆర్ ను ఎన్నుకోవాలని అన్నారు. కాంగ్రెస్ నాయకులు చేస్తున్న 24 గంటల కరెంట్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. 2014కి ముందు నిరంతర విద్యుత్ ఎక్కడుందని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోలో రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డిపై ధ్వజమెత్తుతూ.. మీకు నిరంతర విద్యుత్ కావాలా లేక కాంగ్రెస్ కావాలా అంటూ ప్రజలనుద్దేశించి ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో 24 గంటల కరెంట్ ఎక్కడ ఉండేదని కేటీఆర్ ప్రశ్నించారు. 2014కి ముందు ఆరు గంటల కరెంటు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది కానీ మూడు గంటల కరెంటు కూడా ఇవ్వలేకపోయిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్లు, సంక్షేమ పథకాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న ప్రస్తుత పెన్షన్లు, తీసుకువచ్చిన సంక్షేమ పథకాలను పోలుస్తూ ప్రజలు నిర్ణయం తీసుకోవాలని అన్నారు.
ఇదే క్రమంలో బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్యాస్ సిలిండర్ ధరల పెంపుపై అప్పటి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే, వారు అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యాస్ సిలిండర్ పై రూ.800 పెంచారని మండిపడ్డారు. బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గ్యాస్ సిలిండర్ ను రూ.400 అందిస్తారని కేటీఆర్ హామీ ఇచ్చారు. యాదగిరిని కొత్త జిల్లాగా మార్చిన కేసీఆర్, తిరుపతి తరహాలో యాదగిరిగుట్ట ఆలయాన్ని అభివృద్ధి చేశారని కొనియాడారు. యాదగిరిని మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కిందని పేర్కొన్న కేటీఆర్.. ఈ ప్రాంతం ప్రజలకు కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నించారు.