హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్  రెండో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత  కేంద్రంతో వ్యవహరించే తీరులో మార్పులు వచ్చినట్టుగా  రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. బీజేపీ నేతల్లో కూడ అదే తీరు కన్పిస్తోంది.

2014-2019 మధ్య కాలంలో  తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్, ప్రధాని మోడీ మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయి. ఆ సమయంలో  ఏపీ రాష్ట్రంలో ఎన్డీఏలో భాగస్వామిగా టీడీపీ ఉంది. టీఆర్ఎస్ ఎన్డీఏలో భాగస్వామిగా లేదు. అయితే ఆ సమయంలో  చంద్రబాబునాయుడు కంటే కేసీఆర్ ఎక్కువ దపాలు ప్రధాని మోడీని కలిశాడు.

చంద్రబాబునాయుడు మోడీని కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించినా కూడ కొన్ని సమయాల్లో  ఆయనకు అపాయింట్ మెంట్ దొరకలేదు. కానీ, కేసీఆర్ కు మాత్రం ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ దక్కింది.

 గత ఏడాది డిసెంబర్ మాసంలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ రెండో దఫా అధికారంలోకి వచ్చింది.అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీపై కేసీఆర్ తీవ్రమైన విమర్శలు చేశారు.బీజేపీ నేతలు కూడ అదే స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సమయంలో  కూడ బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఇదే రకమైన వాతావరణం నెలకొంది. 

రెండో దఫా  అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోడీని కేసీఆర్ కలవలేదు. ప్రధానమంత్రిగా మోడీ ప్రమాణం చేసే కార్యక్రమానికి  కేసీఆర్ హాజరుకాలేదు. అదే రోజున ఏపీ సీఎంగా జగన్ ప్రమాణం చేశారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. వీరిద్దరూ కూడ ఢిల్లీకి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ విమానం ల్యాండింగ్ కు ఏటీసి నుండి అనుమతులు రాని కారణంగా  ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకొన్నారు.

ఏపీ సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేయకముందు ఒక్కసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండు దఫాలు ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. రెండో దఫా సీఎం అయ్యాక కేసీఆర్ ఒక్కసారి కూడ మోడీతో సమావేశం కాలేదు.

తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిర్వహించిన సమావేశానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరు కాలేదు.ఈ నెల 26వ తేదీన ఢిల్లీలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి , రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషి హాజరయ్యారు.

తొలిసారి కేసీఆర్ తెలంగాన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికైన సమయంలో  కేంద్రంతో తమకు స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని చెప్పేవారు.రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంతో తమ రాష్ట్రానికి రాజ్యాంగబద్దమైన సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు.

తాము ఎన్డీఏలో భాగస్వామ్యులం కాదు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం తాను ప్రయత్నం చేస్తున్నాను. ఈ మాటకు ఇంకా కట్టుబడి ఉన్నానని ఈ ఏడాది జూన్ 18వ తేదీన  కేసీఆర్ మీడియాకు వివరించిన విషయం తెలిసిందే.

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం కోసం ప్రధాని మోడీని పిలిచేందుకు కేసీఆర్ ప్రయత్నించారు. కానీ, ఆ సమయంలో  మోడీ అపాయింట్ మెంట్  ఆయనకు దొరకలేదని సమాచారం. 

ఈ కారణంగానే మోడీని కేసీఆర్  ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదంటారు. రాష్ట్రంలో జరిగే ప్రతి కార్యక్రమానికి మోడీ ఆహ్వానించాలా అని  మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నలకు కేసీఆర్ సమాధానామిచ్చారు.మొదటి టర్మ్ లో మిషన్ భగీరథ కార్యక్రమం ప్రారంభోత్సవానికి  మోడీని ఆహ్వానించారు కేసీఆర్.