Asianet News TeluguAsianet News Telugu

కోదండరాంపై కేసిఆర్ మల్ల పగ పట్టిండా ?

ఎందుకబ్బా ?
KCR govt unlikely to give permission kadandaram party first public meeting

తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటున్నది. సామాజిక తెలంగాణ లక్ష్యంగా ఆ పార్టీ పుట్టుకొస్తున్నది. తెలంగాణ ఫలాలు ప్రజలకు అందించడమే మా లక్ష్యం అని ఆ పార్టీ చెబుతున్నది. కుటుంబ పాలన అంతం చేయడానికి, నిరంకుశ పాలనకు చరమగీతం పాడడానికి మేం పనిచేస్తామంటున్నది.  ప్రగతి భవన్ గడీలు బద్ధలు కొడతామని భారీ డైగాగులే విసురుతున్నది. కానీ తమ పార్టీని పురిట్లోనే ఖతం చేసేందుకు పాలకపక్షం కసరత్తు చేస్తున్నదని ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ పార్టీ ఎవరిదో కాదు ఆచార్య కోదండరాం పెట్టిన పార్టీ తెలంగాణ జన సమితి. తెలంగాణ జన సమితి ఈనెల 29న ఆవిర్భావ సభ ఏర్పాట్లు చేసుకుంటున్నవేళ ఆ పార్టీకి టిఆర్ఎస్ సర్కారు భయంకరమైన షాక్ ఇచ్చేందుకు స్కెచ్ వేసింది. పగపట్టి కాటేసేందుకు సర్కారు కసి మీద ఉన్నట్లు జన సమితి పసిగట్టింది.

తెలంగాణ వచ్చిన తర్వాత కోదండరాం జెఎసిని మూసివేయకుండా అట్లనే నడిపిండు. తెలంగాణ ప్రజల కోసం జెఎసి నడుస్తది అని ప్రకటించిండు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు వ్యతిరేకంగా సర్కారు నడుస్తుందని కేసిఆర్ సర్కారుపై జెఎసి తరుపున పోరుబాట పట్టిండు. తెలంగాణలో ప్రతిపక్షాల కంటే ఎక్కువగా కోదండరాం సర్కారు మీద పోరు నడిపిండు. దీంతో కోపమొచ్చిన సర్కారు పెద్దలు జెఎసిని చిన్నాభినం చేసేందుకు ప్రయత్నించారు. జెఎసి లో ఉన్న సంఘాలన్నింటిని గుంజి బయట పడేశిర్రు. జెఎసి ని ఒంటరి చేసిర్రు. కోదండరాం ను ఒంటరిని చేసేశిర్రు. అయినా కోదండరాం భయపడలేదు. జెఎసిని చావకుండా బతికించిండు. అంతేకాదు కొత్త మార్గంలో తన పోరాటాన్ని షురూ చేసిర్రు.

తాజాగా కోదండరాం తెలంగాణ జన సమితి పేరుతో రాజకీయ పార్టీని అనౌన్స్ చేశారు. ఈనెల 29న తెలంగాణ జన సమితి ఆవిర్భావ సభకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో సర్కారుకు మల్లా కోదండరాం మీద కోపమొచ్చినట్లుంది. అంతే.. జన సమితి సభకు ఏ గ్రౌండ్ లో అనుమతి వస్తలేదు. మీటింగ్ పెట్టుకోవాలి గ్రౌండ్ కావాలని పోలీసులను అడిగితే పోలీసులు గమ్మతైన ముచ్చట్లు చెప్తున్నారట. వాహనాలు ఎక్కువగా వచ్చి జనాలు వస్తే హైదరాబాద్ లో కాలుష్యం పెరిగిపోతదని కూడా పోలీసులు చెప్పిర్రట. జన సమితి సభకు అనుమతి లేదు కానీ.. ఈనెల 22న సిపిఎం మహాసభలకు పోలీసులు అనుమతించిర్రు. పైగా సిపిఎం మహాసభలకు పూర్తిగా సహకరిస్తానని కేసిఆర్ సిపిఎం నేతలకు హామీ కూడా ఇచ్చిర్రు. కానీ కోదండరాం సభకు మాత్రం అనుమతి లేకుండ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నరు ఎందుకబ్బా అని కోదండ వర్గీయులు ప్రశ్నిస్తున్నరు.

సర్కారు అడ్డు పుల్లలు వేసినా జన సమితి ఆవిర్భావ సభను ఈనెల 29న జరిపి తీరుతామని కోదండరాం స్పష్టం చేశారు. సభ అనుమతి కోసం జన సమితి కోర్టును ఆశ్రయించింది. కోర్టు జోక్యం చేసుకుంటే తెలంగాణ పోలీసులు సచ్చినట్ల అనుమతి ఇయ్యాల్సిందే. సినిమా సభలకు హైదరాబాద్ గ్రౌండ్స్ ఇస్తున్నప్పుడు ఒక రాజకీయ పార్టీ ఆవిర్భావ సభకు అనుమతించకపోవడం తగదన్నారు కోదండరాం. న్యాయస్థానంలో పోరాడి సభకు అనుమతి తెచ్చుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ పెట్టనంతవరకు దమ్ముంటే పార్టీ పెట్టు అని సవాల్ చేసిన కేసిఆర్ తీరా కోదండరాం పార్టీ అనౌన్స్ చేయగానే ఇలా పారిపోతున్నారని జెఎసి కీలక నేత ఒకరు ఏషియానెట్ కు చెప్పారు.

అసలు ఎందుకు కేసిఆర్ సర్కారు కోదండరాం ను మెసలకుండా వత్తేందుకు ప్రయత్నం చేస్తుందబ్బా అంటే చాలా విషయాలు చర్చకు వస్తున్నాయి. కోదండరాం అన్ని రాజకీయ పార్టీల లీడర్ల లెక్క క్రెడిబులిటీ లేని మనిషి కాదు. పిల్లలకు రాజకీయ పాఠాలు చెప్పి రిటైర్ అయిన బడి పంతులు. మచ్చలేని మనిషి. అందుకే ఢిల్లీలో ఇట్లాంటి మచ్చలేని మనిషి కేజ్రీవాల్ చీపురు పట్టుకుని ఊడ్చిపారేసినట్లు ఇక్కడ కూడా కోదండరాం ఊడుస్తడేమోనన్న భయంతోనే పాలక పెద్దలు ఇట్ల మల్ల మల్ల పగబడుతున్నరని జన సమితి నేతుల అనుమానిస్తున్నరు.

కోదండరాం ఏం చేసినా తెలంగాణ సిఎం కేసిఆర్ కు కాక పుడుతున్నది ఎందుకబ్బా అని జెఎసి నేతలు తలపట్టుకుంటున్నరు. తెలంగాణ ఏర్పాటైన నాలుగేళ్లలో కోదండరాం కు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు కేసిఆర్. అదే తెలంగాణకు బద్ధ విరోధులైన వారికి కూడా అపాయింట్ మెంట్ దొరికింది. లగడపాటి రాజగోపాల్ లాంటి వాళ్లకు ప్రగతిభవన్ లోకి ఎంట్రీ ఉంది. కానీ సహచర ఉద్యమ నేత కోదండరాం ను మాత్రం రానీయలేదని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నరు. అసలు కోదండరాం పొడ కూడా కేసిఆర్ కు గిట్టుతలేదు అని ఉద్యమకారులు విమర్శిస్తున్నరు. అప్పట్లో అమరుల స్పూర్తి యాత్రకు అనుమతించలేదు. అడుగడుగునా పోలీసులు అడ్డుకున్నరు. కొలువులకై కొట్లాట సభకు పోలీసులు అనుమతించలేదు. కోర్టుకు పోయి అనుమతి తెచ్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు తీరా రాజకీయ పార్టీ ఆవిర్భావ సభకు సైతం పగబట్టి అనుమతి ఇయ్యకపోవడం దారుణమని తెలంగాణవాదలు వ్యాఖ్యానిస్తున్నరు. మరి తెలంగాణ సర్కారును ఎట్ల ఎదుర్కంటడు కోదండరాం అన్నదే ఇప్పుడు అసలు ముచ్చట.

Follow Us:
Download App:
  • android
  • ios