Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ కోమటిరెడ్డి, సంపత్ కు మరో షాక్

  • కోమటిరెడ్డి, సంపత్  గన్ మెన్ల ను ఉపసంహరించిన సర్కారు
  • మొన్న ఢిల్లీలో తెలంగాణ భవన్ లో గదులు ఇవ్వని సర్కారు
  • సర్కారు తీరుపై కోమటిరెడ్డి ఫైర్
kcr government withdraws gun men of expelled MLAs komatireddy and sampath

తెలంగాణ సర్కారు ప్రతిపక్ష నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ కు మరో షాక్ ఇచ్చింది. బలమైన కారణాలు చూపకుండానే వాళ్ల శాసనసభ సభ్యత్వాలు రద్దు చేశారన్న ఆరోపణలు ఒకపైపు వినిపిస్తుంటే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది సర్కారు. ఈ నిర్ణయంతో కోమటిరెడ్డి, సంపత్ సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

శాసనసభలో స్వామిగౌడ్ కంటి గాయం చేశారన్న కారణం, గవర్నర్ కు సూటి చూసి హెడ్ ఫోన్స్ విసిరేశారన్న కారణం, సభలో అనుచిత ప్రవర్తనకు దిగారన్న కారణాలతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ సభ్యత్వాలను తెలంగాణ అసెంబ్లీ రద్దు చేసింది. దీంతో వారు మాజీలు అయిపోయారని, వారి స్థానంలో ఎన్నికలు జరపాలంటూ సర్కారు గెజిట్ వెలువరించింది. ఆ గెజిట్ ను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపింది. అయితే బాధిత ఎమ్మెల్యేలు కోర్టు మెట్కెక్కారు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి ముందడుగు వేయరాదని హైకోర్టు ఆదేశించింది. ఆరు వారాల పాటు ఎన్నికల విషయంలో కసరత్తు నిలిపివేయాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.

ఇక ఈ ఇద్దరు ఎమ్మెల్యేలను చాన్స్ దొరికినప్పుడల్లా చుక్కలు చేపించేందుకు తెలంగాణ సర్కారు ప్రయత్నం చేస్తోంది. మొన్నటికి మొన్న ఢిల్లీలో ఏఐసిసి ప్లీనరీ సమావేశాలకు వెళ్ళిన ఈ ఇద్దరు నేతలకు ఢిల్లీలో సర్కారు షాక్ ఇచ్చింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు గదులు కూడా ఇయ్యకుండా అవమానాలకు గురిచేసింది. అదేమంటే వారిద్దరూ మాజీ ఎమ్మెల్యేలు కాబట్టి గదుల కేటాయింపు లేదని తెలంగాణ భవన్ అధికారులు పేర్కొన్నారు. అప్పుడు సిఎం ఆఫీసు నుంచి ఫోన్ ఆదేశాలు అందడంతోనే ఆ విధంగా గదులు ఇవ్వలేదన్న ప్రచారం జరుగుతున్నది. విచిత్రమేమంటే.. ఇద్దరిలో ఒకరు మాజీ మంత్రి ఉన్నారు.. అయినా మాజీ ఎమ్మెల్యేలకు కూడా తెలంగాణ భవన్ లో గదులు ఇస్తారు కదా? అని వారు వాదించినా ఫలితం లేకపోయింది. అప్పుడు వారు ప్రయివేటు హోటల్ వెళ్లి అక్కడ తలదాచుకున్నారు.

ఇక మరో షాకింగ్ న్యూస్ ఏమంటే.. తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ఇద్దరికీ మాజీలు అయిపోయారు కాబట్టి సర్కారు ప్రొవైడ్ చేసిన గన్ మెన్లను ఉపసంహరించింది. కోమటిరెడ్డికి, సంపత్ కు 2+2 (మొత్తం నలుగురు) గన్ మెన్లు ఉన్నారు. వారి వద్ద పని చేసే గన్ మెన్లను హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాల్సిందిగా పోలీసు పెద్దల నుంచి ఆదేశాలు అందాయి. తమకు గన్ మెన్ల తొలగింపుపై కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. ఇవాళ ఢిల్లీలో ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు కొద్దిసేపటి క్రితమే గన్ మెన్లు లేకుండానే ఢిల్లీ వెళ్లారు ఇద్దరు నేతలు. తనను చంపేందుకే కేసిఆర్ కుట్రలు చేస్తున్నారని కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. కేసిఆర్ బుల్లెట్ కంటే నా గుండె ధైర్యం గొప్పది అని హెచ్చరించారు. గజ్వెల్ లో కేసిఆర్ మీద పోటీ చేస్తానని సవాల్ చేసిన నాటినుంచి పగ పెంచుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు.

Follow Us:
Download App:
  • android
  • ios