నర్సాపూర్ అసెంబ్లీ నుండి సునీతా లక్ష్మారెడ్డికే బీఆర్ఎస్ టిక్కెట్టు: బీ ఫారం అందించిన కేసీఆర్
నర్సాపూర్ అసెంబ్లీ స్థానం నుండి బీఆర్ఎస్ అభ్యర్ధిగా సునీతా లక్ష్మారెడ్డిని బీఆర్ఎస్ బరిలోకి దింపుతుంది. సునీతా లక్ష్మారెడ్డికి కేసీఆర్ ఇవాళ బీ ఫారం అందించారు.
హైదరాబాద్: నర్సాపూర్ అసెంబ్లీ స్థానం నుండి మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిని అభ్యర్ధిగా బరిలోకి దింపనుంది బీఆర్ఎస్. సునీతా లక్ష్మారెడ్డికి కేసీఆర్ బుధవారంనాడు బీ ఫారం అందించారు. ఈ ఏడాది ఆగస్టు మాసంలో ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో నర్సాపూర్ అసెంబ్లీకి చోటు దక్కలేదు. నర్సాపూర్ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి మరోసారి బీఆర్ఎస్ టిక్కెట్టును ఆశించారు.
దీంతో నర్సాపూర్ పేరును ప్రకటించలేదు. నర్సాపూర్ నుండి మదన్ రెడ్డికే టిక్కెట్టు కేటాయించాలని ఆయన అనుచరులు మంత్రి హరీష్ రావు ఇంటిని ముట్టడించారు. మెదక్ జిల్లాలో ఆందోళనలు నిర్వహించారు. అయితే ఈ దఫా నర్సాపూర్ నుండి సునీతా లక్ష్మారెడ్డికి టిక్కెట్టు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా కేసీఆర్ మదన్ రెడ్డికి వివరించారు. వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ స్థానం నుండి మదన్ రెడ్డిని బరిలోకి దింపనున్నట్టుగా కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇవాళ మధ్యాహ్నం మదన్ రెడ్డి సమక్షంలోనే సునీతా లక్ష్మారెడ్డికి కేసీఆర్ బీ ఫారం అందించారు.
సునీతా లక్ష్మారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో సునీతా లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. ఈ ఎన్నికల్లో సునీతా లక్ష్మారెడ్డిని బరిలోకి దింపాలని బీఆర్ఎస్ చీఫ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ స్థానం నుండి పోటీకి మదన్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలు పోటీ పడ్డారు. మదన్ రెడ్డిని ఒప్పించి సునీతా లక్ష్మారెడ్డికి కేసీఆర్ టిక్కెట్టు కేటాయించారు.
also read:కేసీఆర్‌పై పోటీకి కోమటిరెడ్డి ప్లాన్: రెండు సీట్లివ్వాలని కాంగ్రెస్‌ను కోరిన రాజగోపాల్ రెడ్డి
తెలంగాణలో మూడో దఫా అధికారాన్ని కైవసం చేసుకోవాలని కేసీఆర్ పట్టుదలగా ఉన్నారు. దీంతో గెలుపు గుర్రాలకే టిక్కెట్లు కేటాయించాలని కేసీఆర్ భావించారు. సర్వేల ఆధారంగా టిక్కెట్లు కేటాయించారు. అవసరమైన చోట్ల అభ్యర్థులను మార్చారు. ఇదిలా ఉంటే తెలంగాణ ఏర్పాటు చేసిన రెండు దఫాలు అధికారానికి దూరంగా కాంగ్రెస్ ఉంది.ఈ ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహత్మకంగా అడుగులు వేస్తుంది. మరో వైపు తెలంగాణపై బీజేపీ కూడ ఆశలు పెట్టుకుంది. దక్షిణాదిలో కర్ణాటకలో అధికారానికి బీజేపీ దూరమైంది. అయితే తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవాలని కమలదళం భావిస్తుంది. దీంతో ఈ ఎన్నికలను మూడు పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి.